టీడీపీలో మార్పులు రానున్నాయి.. మామూలు మార్పులు కాదు చాలా చెప్పుకోద‌గ్గ, చాలా మందిని మార్చుకోద‌గ్గ మార్పులు. ఆ క్ర‌మంలో పార్టీని మ‌రింత ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు అధినేత. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే అస్త్ర శ‌స్త్రా ల‌నూ సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు పార్టీలో మార్పులు తీసుకుని వ‌చ్చాక యువ‌త‌రంతో ప‌ని చేయించేందుకు, యువ‌త‌రంను ప్రోత్స‌హించేందుకు కూడా చూస్తున్నారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ల‌ను కాద‌ని జూనియ‌ర్ల‌తోనే పార్టీ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచ‌న‌లో కూడా ఉన్నారు. శ్రీ‌కాకుళం మొద‌లుకుని నెల్లూరు వ‌ర‌కూ యువత‌తోనే పార్టీని నింప‌నున్నారు. వారికే టిక్కెట్లు ఇస్తే బాగుంటుంద‌ని, కొత్త ముఖాల‌ను ప్రోత్సహిస్తే బాగుంటుంద‌ని కూడా వినివ‌స్తోన్న మాట‌లు. స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచి వ‌చ్చిన వారికి మ‌రింత ప్రోత్సాహం ఇచ్చి వారితోనే దిగువ స్థాయిలో ఉన్న క్యాడ‌ర్ ను బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న అధినేత‌ది. అక్క‌డి నుంచి మిగ‌తా వర్గాల‌నూ క‌లుపుకుని పోయే శ‌క్తుల కోసం వేచి చూస్తున్నారు.

 
ఈ క్ర‌మంలో సీనియ‌ర్లు చాలా మంది సైడ్ అయిపోయి జూనియ‌ర్లకు దారి ఇస్తే కొంత‌లో కొంత కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తాయి. రాజ‌కీయ వార‌సులు ఉండ‌నే ఉన్నారు. శ్రీ‌కాకుళం జిల్లాలో ప్ర‌తిభా భార‌తి (మాజీ స్పీక‌ర్ కూతురు) గ్మీష్మ రాజాం నుంచి, న‌ర‌స‌న్న‌పేట‌లో ఎర్ర‌న్నాయుడి త‌మ్ముడి కొడుకు సురేశ్, అదేవిధంగా ఎచ్చెర్ల‌లో ఎర్ర‌న్నాయుడి భ‌క్తుడు క‌లిశెట్టి, క‌ళావెంక‌ట్రావు కొడుకు వీరేకాకుండా చీపురు ప‌ల్లి నుంచి టీడీపీ త‌ర‌ఫున కిమిడి గ‌ణ‌ప‌తి (మాజీ ఎమ్మెల్యే) కొడుకు కిమిడి నాగార్జున ఇలా చాల మంది కొత్త ముఖాలు వ‌స్తున్నాయి. వీరిని ప్రోత్స‌హిస్తూనే తెలుగు యువ‌త‌ను బ‌లోపేతం చేసే చర్య‌లు కూడా చంద్ర‌బాబు చేప‌ట్టున్నారు. తెలుగు యువ‌తతో పాటు ఐ టీడీపీ (డిజిట‌ల్ మీడియా వింగ్) ని కూడా బ‌లోపేతం చేయ‌నున్నారు. ఓ విధంగా పాత నీరు పోయి కొత్త నీరు వ‌స్తే పార్టీ ప‌రువు నిల‌బ‌డుతుంద‌న్న ఆలోచ‌న, సామాన్య కుటుంబాల నుంచి వ‌చ్చిన వారిని విస్మ‌రించ‌క వారికి పార్టీ లో అగ్ర తాంబూలం ఇస్తే బాగుంటుంద‌న్న ప్ర‌తిపాద‌న అధినేత ద‌గ్గ‌ర ఉంది. సీనియ‌ర్లు పార్టీకి సేవ‌లు చేసే ప‌నిలో నిమ‌గ్నం అయి ఉంటే జూనియ‌ర్లు ర‌ణ క్షేత్రంలో ప‌నిచేసేందుకు సులువు అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: