మరో మూడు నెలల్లో మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం ముగిసిపోనుంది. దీంతో మార్చి నెల తర్వాత ఎప్పుడైనా సరే... అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూనే ఉంది. వచ్చే ఏడాది దేశంలో మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశంలోనే అన్నిటికైన పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కోసం ఇప్పటికే అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విస్తృత పర్యటనలు చేస్తూనే ఉంది. మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న హస్తం పార్టీ పెద్దలకు... తాజా ఉప ఎన్నికల ఫలితాలు పెద్ద చిక్కును తెచ్చిపెట్టాయి. అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థంగా మార్చేలా ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. ఇది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ప్రభావితం చేసేలా ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఓటింగ్‌కు వెళ్లిన ఈశాన్య రాష్ట్రాలైన అసోమ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కూడా కమలం పార్టీతో పాటు దాని మిత్ర పక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అసోం రాష్ట్రంలో అయితే హస్తం పార్టీ మరీ దారుణంగా ఉంది. కనీసం డిపాజిట్లు కూడా కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2022లో జరిగే మణిపూర్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిందే. 2017లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ... బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో... కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు హస్తం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: