దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకోవడం తో వారికి ప్రాధాన్యత పెరిగింది. అయితే దానికోసం చాలా మంది ఉన్నారు అనుకున్నప్పుడు ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహకర్తను నియమించుకుంటే బాగుంటుంది. కానీ ఉన్న దిక్కు ఒక్కటే అయితే ఆయా పార్టీల పరిస్థితి ఏమిటి, అసలు ఆ ఒక్క దిక్కు ఎవరికి వ్యూహకర్తగా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యూహకర్త ఎవరినైనా పదవిలో కూర్చోబెట్టగలడా అంటే, అదే నిజమైతే అట్టడుగున ఉన్న కాంగ్రెస్ ఈపాటికే మెరుగయ్యి ఉండాల్సింది. కానీ ఈ వ్యూహకర్తలు కూడా చేయగలిగింది ఏమిటని అర్ధం చేసుకోవాలి అంటే, కాస్త ప్రజలలో అనుకూలత ఉన్న పార్టీకి ఇంకాస్త అండగా ఉండి వాళ్లకు మరింతగా ప్రజాభిమానాన్ని పెంచేస్తే సరిపోతుంది, బహుశా వ్యూహకర్తలు కూడా ఇంతకంటే కష్టపడకపోవచ్చు.

అంతోటి దానికి ఉన్న ఒక్క దిక్కును ఇప్పటికే ఎంతమంది తమ పార్టీ వైపు కాస్త చూడవయ్యా అని అడుక్కొని ఉంటారో! ప్రజా నేతలు అయిఉండి కూడా వాళ్లకు వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలుసుకోలేని వాడు నాయకుడు ఎలా అవుతాడు. ఇక పార్టీ ఎలా నడుపుతాడు. కేవలం పిచ్చి ప్రకటనల ద్వారా ప్రచారం చేసేస్తే నమ్మే స్థాయి నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి సమయంలో నిజాయితీగా తామేమిటి అనేది పరీక్షించుకోలేని ఏ పార్టీకైనా బహుశా ప్రత్యేకంగా వ్యూహకర్తలు కావాల్సి రావచ్చు. నిజమే రాజకీయాలు అంటేనే ఎన్నో వెన్నుపోట్లు, దారుణమైన కుట్రలు. అలాంటివి వేరే పార్టీలు చేస్తూ తమపై గెలవాలని చూస్తుంటే దానిని ఆయా పార్టీలు కనిపెట్టకపోవచ్చు, ప్రజలు చూస్తారు.

వ్యూహకర్తల వెంట పడటం మానేసి, తాము చేసింది ఏమిటో నిజాయితీగా పరీక్షించుకుంటే లోపాలు ఎక్కడ జరిగాయో తెలిసొస్తాయి. అలా కాకుండా కేవలం పిచ్చి ప్రకటనలు చేసుకుంటూ పోతే ఆ పార్టీలు కూడా ఒకనాడు ఏదో ఒకచోట ఆగిపోవడం తప్ప మరో దారి కనిపించదు. దేశానికి ఏమి అవసరం, దానికి రాష్ట్రం చేయగలిగింది ఏమిటి, రాష్ట్రం ప్రజల సహకారంతో ఏమేమి సాధించుకోవాలి ఇవన్నీ ఆలోచించడం ద్వారా సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయవచ్చు కానీ, ఏదో ఒకటి చేసి గెలవాలి అనుకునే రాజకీయాలు ఎక్కువ కాలం నిలవబోవు అని అన్ని పార్టీలు తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: