నెల్లూరు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం రెండో దఫా పర్యటించనున్నారు.  తొలిసారి ఆయన ఏరియల్ సర్వే చేశారు. రెండో దఫా పర్యటనలో నేరుగా ప్రజలను కలుసుకోనున్నారు.  ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ఆయా నియోజక వర్గాల శాసన సభ్యులు  ఒకట్రెండు రోజుల ముందు నుంచే ఆక్కడ మకాం పెట్టారు. ఎందుకో తెలుసా ?

పక్షం రోజులకు పైచిలుకు గా నెల్లూరు జిల్లా వాసులు వరుస తుఫాన్లు, వరదలతో అతలాకుతలం అయ్యారు. చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా మీదుగా వెళ్లే   16వ నంబర్ జాతీయ రహదారి కూడా వరద బీభ త్సం కారణంగా పలు చోట్ల గండ్లుపడ్డాయి. జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. పోలీసు యంత్రాంగం, స్థానికుల సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు  ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. రెండు మూడు రోజల క్రితం వరకు కూడా గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద  ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
వరి సాగుకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ఎక్కువ భాగం కోవూరు నియోజక వర్గంలోనే వరిసాగవుతుంది. ఇక్కడ మూడు పంటలు పండిస్తారు. ఇందతా పెన్నా నది పరీవాహక ప్రాంతం.  ఎప్పుడు పెన్నా నదికి వరదలు వచ్చినా కోవూరు నియోజక వర్గానికి ఇబ్బంది కలిగినట్లు చరిత్రలో లేదు. అలాంటిది ఈ దఫా  వరద ప్రభావం ఎక్కువగా కోవూరు నియోజక వర్గం పైనే పడింది.  వేలాది ఎకరాల్లో చేతికందే పంట నీటి పాలైంది. నెల్లురు నగర నియోజక వర్గం పరిధిలోని భగత్ సింగ్ కాలనీ మొత్తం నీటి మడుగులోనే ఉండింది. ఇప్పుడిప్పుడే  అక్కడి వాసులు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. ఈ  రెండు నియోజక వర్గాలలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  పర్యటిస్తారని ముందస్తు సమాచారం వచ్చింది. దీంతో జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అధికార యంత్రాంగాని కంటే ముందే అయా నియోజకవర్గాల ఎం.ఎల్ ఏలు  ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను సందర్శించారు. వరద సహాయక చర్యలను సమీక్షించారు. ప్రజలతో ఒకట్రేండు సార్లు మాట్లాడారు.  ఏ లోటు లేదు కదా అని అందరినీ అని వాకబు చేశారు. ఒకటి అరా లోపాలను కూడా సరిదిద్ధారు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. వరదలు ముంచేత్తిన సమయంలో బాధితులను పరామర్శించడానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి,  అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి తదితరులు వెళ్లారు. వారికి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.   సోమశిల డ్యాం నుంచి నీటిని విడుదల చేసినప్పుడు తమకు సమాచారం లేదని, ఫలితంగా తాము వరద తాకిడికి గురవ్వాల్సి వచ్చిందని  బాధితులు మంత్రులను నిలదీశారు.  అదే పరిస్థితి ముఖ్యమంత్రి పర్యటనలోనూ  పునావృతం అవుతుందోమో నన్న భయం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నేతల్లో ఏర్పడింది. దీంతో ఎం.ఎల్.ఏలు మంత్రులు ముందస్తు పర్యటనలు చేశారు. అయినా కూడా వారిని భయం వెంటాడుతూనే ఉంది. ప్రజలు ఎక్కడ ముఖ్యమంత్రి ముందు  తమలో దాగి ఉన్న అసంతృప్తిని  వెళ్లగక్కుతారేమో నన్నది వారి  భయం.  ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో  గురువారం  ఓ మహిళ  అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా నెల్లూరు జిల్లా నేతలు ముందస్తు జాగ్రత్త చర్యలుతీసుకున్నారు. జగన్  ను  చూశాక జనం గమ్ముగ ఉంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: