కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ వణికిస్తోంది. దీనిపై వ్యాక్సిన్ల ప్రభావం ఎంతనే అంశంపై సైంటిఫిక్ గా స్పష్టత లేదు. కానీ ఈ వేరియంట్ ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్ మాత్రమే మనల్ని కాపాడగలదని నిపుణులు చెబుతున్నారు. టీకా ఒమిక్రాన్ సోకకుండా అడ్డుకోలేకపోయినా.. తీవ్రంగా జబ్బు బారిన పడకుండా కాపాడుతుంది. ఒమిక్రాన్ సోకితే పరిస్థితి విషమించకుండా.. ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా సంరక్షిస్తుంది.

మన దేశంలో ఒమిక్రాన్ కేసులు రావడంతో ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్ తర్వాత బ్రేక్ ఇచ్చిన కరోనా మళ్లీ విశ్వరూపం చూపిస్తుందని భయపడుతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అప్రమత్తత ముఖ్యమని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే గుర్తించామని పేర్కొంది. అయితే ప్రజలందరూ రెండు డోసుల టీకా తీసుకోవాలనీ.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది.

మరోవైపు మన దేశంలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించింది. వేరే రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. లేదంటే 72గంటల్లోపు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకొని నెగెటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించింది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులలో కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ జాబితాలో ఉన్న 12దేశాల ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టుకు ఆరు గంటలు, ర్యాపిడ్ రిపోర్టుకు 2గంటలు పడుతోంది. వీటి ధరలు 999రూపాయలు, 4వేల 500రూపాయలుగా ఉన్నాయి. 


మొత్తానికి కరోనా వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం పడొచ్చు. కాబట్టి ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. మహమ్మారి బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.









మరింత సమాచారం తెలుసుకోండి: