ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు ఎందుకిలా చేస్తున్నారంటూ ఏకంగా పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు కూడా జారీ చేసింది కేంద్రం. ఈ వివాదానికి ప్రధాన కారణంగా పథకాలు... వాటి పేర్లు మాత్రమే. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను ఎందుకు మార్చారంటూ కేంద్రం మండిపడింది. కేంద్ర పథకాలకు మీ పేర్లు పెట్టి ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడంపై జగన్ సర్కార్ వివరణ కూడా కోరింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నిధులు ఇస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పేర్లు పెట్టుకుంటున్నాయని కేంద్రం ప్రశ్నించింది. ఇతరత్రా పేర్లు పెట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కేంద్రం. పోషణ్ అభియాన్ వంటి పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని.... వీటికి ఎందుకు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారని నిలదీసింది కేంద్రం. అలా పెట్టుకోవడం ఏ మాత్రం కుదరదని తేల్చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్‌లో చేసిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. రఘురామ ఫిర్యాదుపై వెంటనే సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 2021-22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు ఇచ్చిన 187 కోట్ల రూపాయలకు లెక్క కూడా తక్షణమే చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో రఘురామ కృష్ణంరాజుకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకోవడం పై ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: