కారు కొనాలని అనుకుంటున్నారా.. లేక భవిష్యత్ లో కారు కొనే ఆలోచన ఉందా.. కారు మీకు అవసరమా.. అయితే.. వెంటనే కారు కొనేయండి.. వెంటనే అంటే ఈ నెలలోనే కారు కొనండి.. ఎందుకంటే.. వచ్చే జనవరి నుంచి కార్ల రేట్లు పెరుగుతున్నాయి. కార్ల తయారీకి ఉపయోగించే ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల కంపెనీలు మళ్లీ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్ల పెంపు గురించి ప్రకటనలు కూడా చేశాయి. వచ్చే జనవరి నుంచి  మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్‌ వంటి సంస్థలు ధరలను పెంచబోతున్నాయట.


అయితే ఏ మోడల్ ఎంత పెంచుతామనే విషయంపై ఈ సంస్థలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పెంచడం అనేది మోడల్‌ను బట్టి ఉంటుందని మారుతీ సుజుకీ చెప్పింది. వాస్తవానికి ఈ పెంపు గురించి కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే.. వివిధ ముడి వస్తువుల ధరలు కరోనా తర్వాత బాగా పెరిగాయి. వాహనాల తయారీ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ అదనపు ఖర్చులను కంపెనీలు భరించే పరిస్థితి లేదు. ఈ అదనపు వ్యయంలో కొంత వినియోగదారుడిపై మోపక తప్పదన్న నిర్ణయానికి కార్ల కంపెనీలు వచ్చాయి.


అంతే కాదు.. ఈ రేట్ల పెంపు కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. మారుతి సుజికీ విషయానికి వస్తే.. ఈ సంస్త హ్యాచ్‌ బ్యాక్‌ ఆల్టో నుంచి  ఎస్‌యూవీ ఎస్‌ క్రాస్‌ వరకూ అనేక మోడల్స్‌ను  అమ్ముతోంది. ఈ సంస్థ కార్ల ధరలు 3  లక్షల నుంచి 12 లక్షల వరకూ ఉంటాయి. అయితే.. ఈ  మారుతీ సంస్థ ఈ ఏడాదిలో మూడు సార్లు ధరలు పెంచింది.  ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతున్నప్పడు కార్ల ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదంటోంది మారుతి సుజికీ సంస్థ.


మారుతి పరిస్థితి ఇలా ఉంటే.. లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్‌ –బెంజ్‌ కూడా జనవరి 1 నుంచి తమ కార్ల ధరలు 2 శాతం పెంచుతున్నామని ప్రకటించింది. అయితే అన్ని మోడల్స్ రేట్లు పెంచబోమని.. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌కు మాత్రమే పెంచుతామని చెప్పింది. ఇక ఆడి సంస్థ 3 శాతం వరకూ రేట్లు పెంచుతామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: