ఒమిక్రాన్ భయం వివిధ రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోంది. దేశంలో ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ముందుగా కేసులు బయటపడిన కర్నాటకలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కర్నాటక రాష్ట్రంలో అధికారులు, నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. విదేశీ ప్రయాణికులు క్వారంటైన్ ని పూర్తి చేస్తున్నారా..? లేదా..? ఒకవేళ పూర్తయితే ఎక్కడికి వెళ్తున్నారు. వారితో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులెవరు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.

కర్నాటకలో కొత్త రూల్స్..
కర్నాటక ప్రభుత్వం తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. స్కూల్ పిల్లల విషయంలో కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. తల్లిదండ్రులిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే పిల్లలకు స్కూల్ లో ఎంట్రీ అని తేల్చి చెప్పింది. తల్లిదండ్రుల్లో ఎవరు ఒక్కడోస్ మిస్ అయినా అలాంటివారి పిల్లలను స్కూల్ కి రానిచ్చేది లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం.

వ్యాక్సిన్ తోనే అడ్డుకట్ట..
వ్యాక్సిన్ తోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు, నిపుణులు. వ్యాక్సిన్ తీసుకోకపోతే కొవిడ్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని, కొత్త వేరియంటే ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్న వేళ, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకే ఇలా స్కూల్ పిల్లల విషయంలో కొత్త నిబంధనలు తెచ్చినట్టు కర్నాటక ప్రభుత్వం చెబుతోంది.

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పై దృష్టి..
కర్నాటకలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. విదేశాలనుంచి వచ్చినవారు బయటకు వెళ్తే, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పై కూడా నిఘా పెడుతోంది. అలాంటివారిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలంటోంది. ఒమిక్రాన్ కర్నాటకలో బయటపడినా, దాని వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కొత్త నిబంధనలతో కర్నాటకలో కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: