తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్న కారణంగా.. ప్రయాణీకుల ఆదరణ కోల్పోకుండా జాగ్రత్తలపై దృష్టి సారించాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన రూట్లలో బస్సులు నడుపుతూ.. అవసరం లేని రూట్లలో రద్దు చేసి ఖర్చు తగ్గించుకునే విషయాలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లకు 25పైసలు, ఇతర సర్వీసులకు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లగా.. ఛార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. డీజీల్ పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ ఛార్జీలను గతంలో పెంచామనీ.. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ 1440కోట్ల రూపాయల నష్టంలో ఉందన్నారు.

టీఎస్ఆర్టీసీని నష్టాల నంచి గట్టెక్కించేందుకు టికెట్ ఛార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఛార్జీలు పెంచితే.. ఇప్పుడున్న కష్టాల్లో కొంత మేరైనా తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. మూడేళ్లలో ఆర్టీసీకి 4వేల 260కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయనీ.. ఛార్జీలు పెంచితే ఏడాదికి 850కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అటు డీజిల్ ధరలు పెరగడం వల్ల భారం ఎక్కువైందని ఛైర్మన్ బాజిరెడ్డి తెలిపారు.

టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఇటీవల ఆర్టీసీ బస్సులో సందడి చేశారు. టీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, శుభప్రదం అని ప్రయాణీకులకు వివరించేలా ఈ విధానం అవలంభించారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా సజ్జనార్ తన కుటుంబ సభ్యులను కూడా భాగం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతేకాదు ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తదానం చేసిన వారు డిపో నుంచి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్ తో కలిసి రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు సైతం రక్తదానంలో పాల్గొన్నారు.  













 

మరింత సమాచారం తెలుసుకోండి: