ఏపీ సర్కారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది.. నిధుల వేటలో సతమతం అవుతోంది.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగానే ఉంది.. ఇదీ టీడీపీ తరచూ చేస్తున్న ప్రచారం.. అయితే.. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నా ఏపీలో ఏ సంక్షేమ పథకమూ ఆగడం లేదు. జగన్ సర్కారు ఇచ్చిన హామీల్లో చాలా వరకూ అమలవుతూనే ఉన్నాయి. అయితే.. నిధుల సమీకరణలో జగన్ సర్కారు అక్రమా మార్గాలు అవలంభిస్తోందని తెలుగుదేశం విమర్శిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ సంస్థ అయినా తన మిగులు నిధులు ఏపీఫైనాన్స్ కార్పొరేషన్‌ లోనే జమ చేయాలని నిబంధన తెచ్చింది.


అయితే.. ఈ నిబంధన ద్వారా నిధుల మళ్లింపు ఇప్పుడు మరోవివాదంగా మారుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన 400 కోట్ల నిధులు మళ్లించాలంటూ తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని... ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ శ్యాంప్రసాద్‌ ఓ వీడియోలో చెప్పడం జగన్ సర్కారును ఇరుకున పెడుతోంది. వీసీగా  ఉంటావా, పోతావా అంటూ తన కాళ్లూ చేతులు కట్టేస్తే ఏం చేయగలనని ఆయన ఆ వీడియోలో నిస్సహాయత వ్యక్తంచేశారు. తాను ఈ నిధుల మళ్లింపుపై నెల రోజులుగా సజ్జల సహా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగానంటూ వీసీ  ఆవేదన వెలిబుచ్చారు.


ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిధుల మళ్లింపు అంశంపై వీసీ శ్యాంప్రసాద్‌ ఏపీఎన్జీవో  నాయకులతో చర్చించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. దీన్ని టీడీపీ వర్గాలు బాగా ప్రచారం చేస్తున్నాయి. తనతో బలవంతంగా నిధులు మళ్లింపు చేయించారని.. 50 ఏళ్లు సర్జన్‌గా పనిచేసిన తాను, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ఆ వీడియోలో వీసీ  అన్నారు. నెల నుంచి ప్రతిరోజూ గంటల తరబడి ప్రభుత్వ ముఖ్యుల వద్ద చేతులు కట్టుకుని, తలదించుకుని నిలబడ్డానని వీసీ శ్యాంప్రసాద్‌ చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది.  చివరికి సీఎం జగన్‌ కూడా తనతో మాట్లాడారని... 10 రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని జగన్ తనకు  హామీ ఇచ్చారని వీసీ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: