కొణిజేటి రోశయ్య... దేశ రాజకీయాల్లో ఈ పేరు తెలియని రాజకీయ నేతలు ఉండరేమో. 1933లో జన్మించిన రోశయ్య తొలిసారి 1968లో చట్టసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా కెరీర్ ప్రారంభించిన కొణిజేటి రోశయ్య... అంచెలంచెలుగా ఎదిగారు. హస్తం పార్టీ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకునా కూడా... ఆయన మాత్రం చట్ట సభల్లోనే ఉన్నారు. 1968 నుంచి 1985 వరకు దాదాపు 17 సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యునిగా సుదీర్ఘ కాలం పని చేశారు. మండలిలో ప్రతి పక్ష నేతగా 1978-79 మధ్య కాలంలో వ్యవహరించారు. మంత్రి వర్గంలో కీలక శాఖలు అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలోని అందరు ముఖ్యమంత్రుల దగ్గర కూడా ఆయన పని చేశారు. ఏ రోజు కూడా ఆయన పదవి కోసం ఆరాట పడలేదు.లాబీయింగ్ చేయలేదు. చివరికి ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు పిలిచి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల్లో చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే.. ఇతర పార్టీల్లోకి మారిన వారే. చివరికి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారే. చంద్రబాబు నాయుడు టీడీపీలోకి మారారు. వైఎస్ఆర్ కొద్ది రోజులు రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హస్తం పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర అంటూ ప్రత్యేక పార్టీ పెట్టారు. కానీ రోశయ్య మాత్రం... తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఒక దశలో మీ సేవలు చాలా అవసరం అంటూ నందమూరి తారక రామారావు ఆహ్వానం పంపినా కూడా... సున్నితంగా తిరస్కరించారు. తాను హస్తం పార్టీలో ఉంటానని... తనకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను తొలగించినప్పుడు కూడా... ఆయన ఏ మాత్రం బాధపడలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఆ తర్వాత హస్తం పార్టీ ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమించింది. కేంద్రంలో ప్రభుత్వం మారినా కూడా.. రోశయ్యను మాత్రం గవర్నర్‌గానే కొనసాగించింది మోదీ ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: