కొణిజేటి రోశయ్య... ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత. అటు మండలిలో, ఇటు శాసన సభ, పార్లమెంట్‌లో కూడా రోశయ్య పనిచేశారు. 1968లోనే రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్య... ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ ఆయన మాత్రం 1989లోనే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అది కూడా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి. ఆయన పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం అయినప్పటికీ... ఆయనకు తొలి నుంచి ప్రకాశం జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది. అందుకు ప్రత్యేక కారణం అంటూ ఏం లేదని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ... ప్రకాశం జిల్లా నేతలతో విడదీయరాని అభిమానం ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంతో ప్రత్యేక బంధం. అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలు అన్నా కూడా రోశయ్యకు ప్రత్యేక అభిమానం. ఇక రోశయ్యకు దైవ భక్తి కూడా ఎక్కువే. ప్రకాశం జిల్లా పర్యటనలో ప్రతి సారి కూడా చీరాల కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దర్శనం తప్పనిసరి.

ఇక జిల్లాలోని త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రోశయ్య తన వంతు కృషి చేశారు. మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి భారీగా విరాళం ఇచ్చారు. చీరాల ప్రాంతంలోని వ్యాపారాభివృద్ధికి ఎంతో కృషి చేశారు రోశయ్య. వస్త్ర వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందించేలా... చీరాల పట్టణంలో వస్త్రలత నిర్మాణం కోసం రోశయ్య చేసిన కృషి అంతా ఇంత కాదు. చీరాల మునిసిపాలిటీ అభివృద్ధిలో రోశయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో కూడా చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రయత్నించారు. విజయవాడ - చెన్నై మార్గంలో ఉన్న చీరాల రైల్వే స్టేషన్‌లో దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారు. ఇక జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులతో రోశయ్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ అన్న సత్రం, వాసవి నిత్యాన్నదాన సత్రాల కమిటీ ఎంపికలు రోశయ్య ఆధ్వర్యంలో జరుగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: