ముఖ్యమంత్రి పదవి అనూహ్యంగా వచ్చింది. తనకు ఎంతో ఆప్తుడైన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన పదవి తనకు వద్దని కూడా ఎంతో సున్నితంగా అధిష్ఠానానికి చెప్పారు. అయినా సరే... తప్పదు మీరు మాత్రమే ప్రస్తుతం ఆ పదవిలో ఉండాలని హై కమాండ్ ఆదేశించింది. ఇక తప్పదని అయిష్టంగానే ఆ పదవిలో కూర్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. దాదాపు 14 నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కూడా... వైఎస్ఆర్‌ను గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. రోశయ్యకు తొలి నుంచి విమాన ప్రయాణాలు అంటే ఎందుకో అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఇక హెలికాఫ్టర్ ప్రయాణం అంటే మనకెందుకు ఈ గాలి ప్రయాణాలు అంటూ చమత్కరించే వారు కూడా. నలుగురితో కలిసి ప్రయాణం చేస్తేనే హాయిగా ఉంటుందంటారు రోశయ్య.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. జిల్లాల పర్యటకు వెళ్లిన సమయంలో కూడా సాధ్యమైనంత వరకు రోడ్డు మార్గంలోనే ప్రయాణించే వారు. 2010లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో కొణిజేటి రోశయ్య హెలికాఫ్టర్‌ను దూరంగానే ఉంచారు. ముందుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి పూళ్ల గ్రామం వరకు మాత్రమే హెలికాఫ్టర్ ప్రయాణం. అక్కడి నుంచి కూడా కారులోనే తన పర్యటన కొనసాగించారు రోశయ్య. సాయంత్రం పూట విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వెళ్దామని సహచర మంత్రులు చెప్పినప్పటికీ... అంత త్వరగా మనం వెళ్లి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని చమత్కరించారు. చివరికి ఏలూరు పట్టణం నుంచి ప్రత్యేక రైలులో హైదరాబాద్ పయనమయ్యారు. రాత్రి పూట హాయిగా పడుకుని వెళితే చాలు కదా... ఎందుకు తొందర అని అనేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: