ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల పాలన మొదలైన నాటి నుంచి శాంతిభద్రతలు తొలగిపోయి అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల పాలనలో అక్కడి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తాలిబన్లు మహిళల పట్ల తీవ్ర స్థాయిలో వివక్ష చూపుతూ ఉండటం గమనార్హం. మహిళలు కనీసం చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం లేదు అంటూ తాలిబన్లు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంతేకాదు క్రీడలలో కూడా మహిళలు ఉండాల్సిన అవసరం లేదు అంటూ దారుణంగా వ్యవహరించటం మొదలుపెట్టారు.


 ఇలా అడుగడుగునా మహిళలపై వివక్ష చూపుతు తాలిబన్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. అయితే తాలిబన్ల పాలనలో మొదలైన తర్వాత మొట్టమొదటిసారి తాలిబన్లు మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహం చేసుకోవడానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఇటీవల తాలిబన్ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బలవంతపు పెళ్ళిళ్ళు తమ పాలనలో నిషేధం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తాలిబన్లు. స్త్రీలు పురుషులు సమానమే అని స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదు అంటూ పేర్కొన్నారు.



 అయితే మహిళల పై తీవ్రస్థాయిలో వివక్ష చూపుతూ వేధింపులకు పాల్పడిన చరిత్ర తాలిబన్లకు ఉంది అని.. ఇటీవలే రెండవసారి ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్ల తీరులో మార్పు రాలేదు అంటూ విశ్లేషకులు అంటున్నారు. రోజు రోజుకు తాలిబన్లు మహిళలపై వివక్ష చూపుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాలిబన్ల ప్రభుత్వం మహిళల పట్ల ఉదార వైఖరి ప్రదర్శించింది అంటూ విశ్లేషకులు అంటున్నారు. అయితే అప్పట్లో ఆడపిల్లలను బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవడం, ఆడపిల్లలని అమ్ముకోవడం, అప్పు కింద చెల్లించడం, సంధి కోసం పణంగా పెట్టడం వంటివి కూడా ఆఫ్ఘనిస్థాన్లో అప్పట్లో తాలిబన్ల పాలనలో కొనసాగాయి. ఇక ఇలాంటి  ఆచారాలు అన్నింటినీ మార్చే విధంగా తాలిబన్ల ఉత్తర్వులు ఉన్నాయి. మరి ఈ ఉత్తర్వులు అన్నింటినీ సక్రమంగా అమలు చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: