జవాద్ తుఫాన్ తీరం వైపు తరుముకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్... ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెను తుఫాను విరుచుకు పడుతుందని కేంద్రం కూడా ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరించింది కూడా. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఒడిశాలోని గోపాల్ పూర్, బరంపూర్, పూరి, కోణార్క్, పారాదీప్ ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జవాద్ తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అలాగే మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని గార, సంతబొమ్మాళి, పలాస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, నరసన్నపేట మండలాల్లోని తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఒడిశా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను బారిన పడతారని భావిస్తున్న దాదాపు 400 మంది పైగా గర్భిణీ స్త్రీల కోసం నవీన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లల్లో ఉన్నగర్భిణీలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలని నవీన్ పట్నాయక్ సర్కార్ నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు... తీర ప్రాంత సమీపంలోని అన్ని ఇళ్లకు వెళ్లి గర్భిణీల వివరాలు సేకరిస్తున్నారు. గర్భిణీలను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జవాద్ తుపాను పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావారణ శాఖ వెల్లడించింది. ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతంతో పాటు, ఒడిశాలోని దక్షిణ కోస్తా ప్రాంతంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాకు, ఒడిశాలోని గోపాల్ పూర్ సమితి, బరంపూర్ సమితి, పూరీ సమితికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్రం. అటు తుఫాను ప్రభావంతో బెంగాల్, అసోమ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: