ఏటా పంట ఏదో ఒక రూపంలో పోతూనే ఉంది. గ‌డిచిన కొన్ని గంట‌ల నిడివిన ప‌డిన వాన కార‌ణంగా పంట పోయింది. మ‌ళ్లీ సిక్కోలుకు క‌ష్టాలు చుట్టుముట్టి, అత‌లాకుత‌లం, క‌కావిక‌లం చేస్తున్నాయి. ఇప్ప‌టిదాకా ఉన్న విధంగా రేపు కూడా వాతావ‌ర‌ణం ఉంటే ఈ ఏడాది గింజ కూడా త‌మ‌కు ద‌క్క‌ద‌ని క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. అప్పులు చేసి సాగు చేసే త‌మ‌కు ఏటా తీవ్ర తుఫానులు కార‌ణంగా ఏమీ మిగ‌ల‌డం లేద‌ని వాపోతున్నారు. ఈ త‌రుణాన కేంద్రం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌ను ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు. జ‌వాద్ తుఫాను ప్ర‌భావం ఆంధ్రాతో పాటు ఒడిశాకు ఉండ‌డంతో ఈ రెండు రాష్ట్రాల యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఆంధ్రాకు సంబంధించి శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ఒడిశాకు సంబంధించి గంజాం, గ‌జ‌ప‌తి, పూరీ, జ‌గ‌జిత్ సింగ్ పూర్ జిల్లాలు ప్ర‌భావిత ప్రాంతాలుగా ఉన్నాయి. వీటి గురించి కేంద్రం కూడా ఆరా తీస్తోంది.



పంట‌లు పోయి కొంద‌రు.. పంట న‌ష్టం అంచ‌నాల్లో లేక ఇంకొంద‌రు.. వాన రాక‌తో త‌ల్ల‌డిల్లిపోతున్నారు. నెల రోజుల వ్య‌వ‌ధిలో రెండు తుఫానులు (గులాబ్, జ‌వాద్) ఉత్త‌రాంధ్ర‌కు య‌మ‌పాశం అయి ఉన్నాయి. ముందున్న తీరులో వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో పంట‌ను దాచుకునే ప్ర‌య‌త్నాలు రైతులు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఈ ఏడాది నానా క‌ష్టాలు ప‌డి వాన‌లు దాటుకుని తుఫానులు దాటుకుని తాము సాగు చేసిన‌ప్ప‌టికీ  ప్ర‌కృతి శాపం ద‌గ్గ‌ర తామంతా ఓడిపోయామ‌ని అంటున్నారు రైతులు.


జ‌వాద్ తుఫాను రాకతో రెండు ఉత్త రాంధ్ర జిల్లాలు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు తుఫాను అలజ‌డికి  చిగురుటాకుల్లా వ‌ణికిపోతున్నాయి. తుఫాను రేపు మ‌ధ్యాహ్నం తీరం దాటే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో స‌ముద్ర‌పు ఒడ్డు గ్రామాలు భ‌యాందోళ‌న‌ల్లో ఉన్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో తుఫాను ముంచుకు వచ్చినందున రైతులంతా పంట‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాక మునుపే వాన త‌మ‌కో విల‌న్ లా మారింద‌ని వీరంతా గ‌గ్గోలు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: