నెల్లూరు జిల్లాలో అమరావతి పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర సజావుగానే సాగినా.. నెల్లూరులోకి ప్రవేశించిన తర్వాత మాత్రం పాదయాత్రకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తొలిరోజే కావలిలో పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. అమరావతి యాత్రలో ప్రచార వాహనాలు ఉన్నాయంటూ స్థానిక పోలీసులు అడ్డుచెప్పడం వివాదంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. వెంకటగిరి సీఐ మల్లికార్జున మహిళా రైతుల్ని బూతులు తిట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం వెంకటగిరి ప్రాంతంలో కొనసాగుతోంది. అయితే ఈ పాదయాత్రలో పోలీసులు మహిళా రైతుల్ని బూతులు తిట్టారట..  దీంతో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్, స్థానిక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరు ఏం చేయగలరంటూ ప్రశ్నించారు. అమరావతి మహిళా రైతులు కూడా సీఐతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు పోలీసులకు మధ్య గొడవ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అమరావతి రైతులపై దురుసుగా ప్రవర్తించిన సీఐని సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా డిమాండ్ చేశారు. మొత్తమ్మీద ఇప్పుడా సీఐ అందరికీ టార్గెట్ అయ్యారు.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు కావాలనే అడ్డంకులు కల్పిస్తున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులను ఉపయోగించి, పాదయాత్రకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని  వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రజల్లో అమరావతి రాజధానికి వస్తున్న మద్దతు చూసి, ఓర్వలేకనే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు వసతులు కల్పించిన వారిపై కూడా స్థానిక వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించినా అమరావతి రాజధాని కోసం చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర కొనసాగిస్తామని అన్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర ఎపిసోడ్ మొత్తం గందరగోళంగానే సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: