టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై రాజకీయంగా రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల విషయంలో వైసీపీ మొదటి నుంచి దూకుడుగానే ఉంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత చంద్రబాబు దానిపై కన్నీరు పెట్టుకోవడం.. ఇక అసెంబ్లీకి సీఎంగానే వస్తానని ప్రతిజ్ఞ చేయడం.. ఆ తర్వాత నందమూరి కుటుంబం కూడా స్పందించడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయాన్ని చంద్రబాబు వరదల పర్యటనల్లో సైతం ప్రస్తావించండం చూస్తే టీడీపీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టే అవకాశం లేదని తేలిపోయింది.


అయితే ఈ అనుచిత వ్యాఖ్యల విషయంలో మొదటి నుంచి దూకుడుగా ఉన్న జగన్ టీమ్ ఇప్పుడు కాస్త స్వరం మారుస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ ఆడకూతురుని అలా వ్యాఖ్యానించడం సరికాదన్న అభిప్రాయం జనంలో కనిపిస్తోంది. రాజకీయాలు ఎలా వున్నా.. వాటిలోకి మహిళలను లాగకూడదని చాలా మంది పార్టీలకు అతీతంగా చెబుతున్నారు. రాజకీయాలు, గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ఇంటర్‌ నెట్‌లో ట్రోలింగ్.. ఈ వ్యవహారాలన్నీ చర్చకు వస్తున్నాయి.


మొత్తం మీద ఈ వ్యవహారం కాస్త ఇబ్బందికరంగా మారడంతో వైసీపీలో స్వరం మారుతోంది. మొన్నటికి మొన్న ఈ వ్యాఖ్యలకు కేంద్రబిందువైన ఎమ్మెల్యే వంశీటీవీ ఛానల్ చర్చలో స్వయంగా భువనేశ్వరికి క్షమాపణ చెప్పేశారు. తాను ఆమెను అక్కా అంటానని.. పొరపాటున నోరు జారానని ఆయన ఒప్పేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి కూడా అదే తరహాలో మాట్లాడారు. చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా తామంతా తప్పుబట్టామన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా... ఆ మాటలు వైకాపా ఎమ్మెల్యేలు అన్నారని ప్రచారం చేయడం సరికాదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి   అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: