ద‌క్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన నూత‌న వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ రోజు రోజుకు పెరుగుతున్న త‌రుణంలో తెలంగాణ ఆర్టీసీ తాజాగా అప్ర‌మ‌త్తం అయింది.  ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఉత్త‌ర్వుల‌ను జారీ చేసారు.  ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతుండ‌డం.. భార‌త్ లో కూడా 3 కేసులు న‌మోదు కావ‌డంతో ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం ఆయా ప్ర‌భుత్వాలు మ‌ళ్లీ ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ త‌రుణంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం మాస్క్‌ల వినియోగం పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విధిత‌మే. ముఖ్యంగా ఎవ‌రైనా మాస్క్ లేకుండా బ‌య‌ట తిరిగిన‌ట్ట‌యితే వారికి రూ.1000 వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

టీఎస్ఆర్టీసీ సైతం తాజాగా ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. మాస్క్ ఉంటేనే ప్ర‌యాణికుల‌ను బ‌స్సులోకి అనుమ‌తించాల‌ని ఆర్టీసీ సిబ్బంది సీపీ స‌జ్జ‌నార్ కీల‌క ఆదేశాలు జారీ చేసారు. మాస్క్ లేని వారిని ఎట్టి ప‌రిస్థితిలో కూడా బ‌స్సులోకి అనుమ‌తించ‌వ‌ద్దు అని స్ప‌ష్టం చేసారు స‌జ్జ‌నార్‌. ప్ర‌యాణికుల‌తో పాటు ప్ర‌తీ ఆర్టీసీ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌లు కూడా త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాలి అని త‌న ఆదేశాల‌లో పేర్కొన్నారు స‌జ్జ‌నార్‌. శానిటైజ‌ర్ బాటిల్‌ను అందుబాటులో ఉంచుకుని.. డిపో నుంచి బస్సులు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా పూర్తిస్థాయిలో శుభ్రం చేయాల‌ని సూచించారు. అదేవిధంగా క‌రోనా సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను మైకుల ద్వారా బ‌స్టాండ్ల‌లో ప్ర‌చారం  చేయాల‌ని ఆర్టీసీ ఎండీ సూచించారు.
 
ఎప్ప‌టిక‌ప్పుడూ బ‌స్టాండ్లను శుభ్రం చేసేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆర్టీసీ అధికారుల‌ను స‌జ్జ‌నార్ ఆదేశించారు.  ముఖ్యంగా అన్ని రెస్ట్ రూముల‌లో స‌బ్బుల‌ను అందుబాటులో ఉంచాల‌ని.. క‌రోనా నిబంధ‌న‌లు పూర్తి స్థాయిలో అమ‌లు అయ్యేవిధంగా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌లు చేసారు ఎండీ. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఏదో ఒక‌టి వినూత్న కార్య‌క్ర‌మం చేప‌డుతూనే ఉన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కొన్ని రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇటీవ‌ల  పెళ్లికి ఆర్టీసీ బ‌స్ బుక్ చేసుకున్న‌వారికి బ‌హుమ‌తి కూడా అంద‌జేసే కార్య‌క్ర‌మం తీసుకొచ్చారు. ప్ర‌యాణికులను క‌రోనా నుంచి ర‌క్షించ‌చడ కోసం ఇప్పుడు నూత‌నంగా మాస్క్ ధ‌రించాలి అనే ఈ రూల్ తీసుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: