ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మానవాభివృద్ధి పునాదిగా మరింత ఉన్నతంగా ఉండాలని ఎప్పుడూ సమాజం కోరుకుంటూనే ఉంటుంది. అది మానవ సమాజ సహజ లక్షణం. అధికారానికి వచ్చిన రాజకీయ పార్టీలు రాజనీతిజ్ఞత కొరవడిన కారణంగా స్వార్థ ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధి కోసమే పనిచేయడంతో ప్రజల ఆకాంక్షలు ఆచరణకు నోచుకోవడం లేదు. రాజ్యాంగపరంగా ఎన్నో ఆకాంక్షలను రాసుకున్నప్పటికీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కొరవడిన కారణంగా రాజ్యాంగ ఫలాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. దాని కారణంగా 20 శాతం జనాభా దారిద్ర్యరేఖకు కింద జీవిస్తుంటే, 40 శాతం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, 73 శాతం సంపద1%   సంపన్నవర్గాల చేతిలో కేంద్రీకృతమైంది. అసమానతలు, అంతరాలు, వివక్షత ఆకాశాన్ని అంటే స్థాయిలో  ఉంటే "ప్రజాస్వామ్య దేశం" అని పలుమార్లు సంబరపడిపోతున్నారు.

    అందుకే భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ రోజు హైదరాబాదులో ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు న్యాయాన్ని అందించడం ద్వారా రాజ్యాంగ పలాలను చేరువ చేయాలని కోరారు. న్యాయశాస్త్ర పట్టాలు పదవులు ముఖ్యం కాదని వ్యవహారిక జ్ఞానముతో వివాదాలను తమ మధ్యనే పరిష్కరించడమే ఉన్నత లక్ష్యం కావాలని కోరడాన్ని బట్టి సామాజిక న్యాయం ఎంత ముఖ్యమైనదో తెలుస్తున్నది.
      చట్టాల రూపకల్పనలో , చట్టాలను అమలు చేసే తీరులోనూ ప్రభుత్వాలు పెత్తందారీ వర్గాలకు వత్తాసు పలకడంతో పేద ప్రజలకు తీరని దుఃఖంను కట్ట పెడుతున్నాయి. ప్రతి కడప చేరాల్సిన సామాజిక న్యాయం, రాజ్యాంగ ఫలాలు కొన్ని రాబందులు రాజకీయ పార్టీల నాయకుల చేతిలోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మెరుగైన సమాజం ఎలా సాధ్యం? ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. కవులు రచయితలు కళాకారులు నినదించి రచనలు చేయాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వ సాచివేత నిర్బంధ  విధానాలను ఖండించాలి.
       కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల కోసం చేసిన చట్టాలు రైతు పోరాటం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం రైతుల విజయంగా భావించవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా అమరావతి ఒకవైపు కొనసాగుతుంటే దాన్ని కాదని మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చి బిల్లును ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. 700 రోజులకు పైగా స్థానిక రైతులు ,ప్రజల యొక్క పోరాటాన్ని తట్టుకోలేని రాష్ట్రప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లును  ఉపసంహరించుకోవడంతో ప్రజా ఉద్యమం ముందు ప్రభుత్వం ఓడిపోయినట్లు అయింది .ఈ రకంగా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిరంతరం కొనసాగితే తప్ప ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: