కరోనా మహమ్మారిని ఎదుర్కొవాలంటే ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రపంచంలో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నాటి నుంచి భారత్‌లో మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 110 కోట్ల డోసులు పైగా ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విడతల వారీగా వ్యాక్సిన్‌ను కేంద్రం అందిస్తోంది. ఇప్పుడు అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు వైద్య సిబ్బంది. భారత్‌లో నిన్న ఒక్క రోజే ఏకంగా కోటి మందికి వ్యాక్సిన్ అందించారు. దీని ద్వారా దేశ వ్యాప్తంగా సగం మందికి పైగా రెండు డోసులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపుకు చేరుకుంది. ఇది మార్చి 2020 నాటి నుంచి అతి తక్కువగా నమోదైంది. ఇక రోజు వారీ సానుకూలత రేటు 2 శాతం కంటే కూడా తక్కువ. దేశంలో సగానికి పైగా జనాభా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల దగ్గర కూడా దాదాపు 21.50 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ భయం ప్రతి ఒక్కరిలో ఉందని... అందుకోసం వ్యాక్సినేషన్ పైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు విముఖత చూపించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి... డోస్ తీసుకునేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఒక్క రోజే బీహార్‌లో 15 లక్షలు, తమిళనాడులో 14.80 లక్షలు, రాజస్థాన్‌లో 11 లక్షలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పదిన్నర లక్షల మందికి వ్యాక్సిన్ డోసు వేశారు. ఇప్పటికే దేశంలో దాదాపు 85 శాతం మంది సీనియర్ సిటిజన్స్‌ తొలి డోసు పూర్తి కాగా... 51 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలోని 30 జిల్లాలోనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, మిజోరాం, జమ్ము రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: