ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ తుఫాన్‌ ముప్పు తప్పినట్ట‌యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌గా  మారి ఉత్తరాంధ్ర‌-ఒడిషా తీరం వైపున‌కు దూసుకు వస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విధిత‌మే.  అయితే తాజాగా సముద్రంలోనే జవాద్ తుఫాన్‌ బలహీనపడిన‌ది అని దీనితో ఇక ఏపీకి పెద్దగా ముప్పు ఏమి ఉండ‌ద‌ని ఐఎండీ వెల్ల‌డించింది.  

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జ‌వాద్ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండి తెలిపిన‌ది.  ఇది ఉత్తర-ఈశాన్య దిశల వైపు కదిలి మధ్యాహ్నానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రమాదకర స్థాయిలో కాకుండా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొన్న‌ది.

ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నంకు  తూర్పు-ఆగ్నేయంగా 180 కి.మీ, ఒడిషాలోకి గోపాల్‌పూర్ కి దక్షిణంగా 200 కి.మీ, పూరీకి నైరుతి దిశలో 270 కి.మీ, పారాదీప్ కి నైరుతి దిశలో 360 కి.మీ దూరంలో ప్రస్తుతం వాయుగుండం కేంద్రీకృతమై ఉన్న‌ద‌ని వాతావరణ శాఖ ప్రకటన చేసింది.  జవాద్ తుఫాన్‌ బలహీనపడ్డప్పటికీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు కొనసాగనున్నాయని హెచ్చరించారు. కాబట్టి తీర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని  సూచించారు అధికారులు.  ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిషా తీరంలో ముఖ్యంగా చేప‌ల‌ వేటకు అస‌లు వెళ్లకూడదని మత్స్యకారులకు ఐఎండి సూచించిన‌ది.

ఇప్పటికే ఏపీని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్న సమయంలోనే బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్‌ ఏర్పడింది. ఈ తుఫాన్‌ ఉత్తరాంధ్రలో వర్షబీభత్సం సృష్టించనున్నట్టు ముంద‌స్తుగానే ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై సిద్ధంగా ఉన్న‌ది.  తుఫాన్‌ ప్రభావిత ఉత్తరాంధ్రలో మూడు రోజుల ముందుగానే రెస్క్యూ టీమ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌తో పాటు 45 మందితో ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ ప‌రిధిలో 21 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు.

విశాఖ‌ప‌ట్నంలోని ఏడు రిజ‌ర్వాయ‌ర్ల‌లో అత్య‌వ‌స‌ర పరిస్థితుల‌లో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులను సిద్దం చేసారు.  జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖఅధికారులతో సమన్వయం  చేసుకొంటూ  సహాయక చర్యలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన‌ది.  తుఫాన్‌ ప్రభావంతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే చెట్లు విరిగిపడే ప్రమాదముంద‌ని భావించి జేసీబీలతో పాటు చెట్లను కట్ చేసే యంత్రాలను కూడా సిద్దం చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ముంద‌స్తుగానే అధికారులు సూచించారు.

విశాఖలో కంట్రోల్  రూమ్స్ ఏర్పాటు చేసి  0891-2590100,0891-2590102,0891-2750090,  నెంబర్లకు ఫోన్ ద్వారా స‌మాచారం చేర‌వేయాల‌ని హెల్ప్‌లైన్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు అధికారులు సూచించారు. ఇలా జవాద్ సైక్లోన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సిద్ధ‌మైన‌ది. ప్రజలు కూడా భయంతో ఉన్న‌ సమయంలో ఐఎండీ శుభ‌వార్త చెప్పింది. జవాద్ తుఫాన్‌ బలహీనపడిన‌ద‌ని.. దీంతో  ముందుగా ఊహించినంత‌ ముప్పు ఉండ‌దని ఐఎండీ తెలిపింది. దీంతో ప్రజలతో పాటు అధికారులు కూడా  ఊపిరి పీల్చుకున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: