ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్సీ పోరు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్‌కు పూర్తి బ‌లం ఉన్నా.. పార్టీ గెలుపు కోసం క్యాంపు రాజ‌కీయాలు చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది. ఖ‌మ్మం ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు మ‌ద్ధ‌తుగా ఉండేది. అయితే, ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్‌, కాంగ్రెస్ త‌రువాతి స్థానం అయింది. అయినా, ఉనికి కాపాడుకునేందుకు గ‌ట్టిపోరాట‌మే చేస్తున్నాయి ఎర్ర పార్టీలు. ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఎం వైఖ‌రి ఏంట‌న్న‌ది చర్చ‌గా మారింది. అయితే, ఆ రెండు పార్టీల నుంచి అభ్య‌ర్థులు ఎవ‌రూ బ‌రిలో లేక‌పోయినా.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తాతా మ‌ధు, కాంగ్రెస్ నుంచి బ‌రిలో ఉన్న రాయ‌ల నాగేశ్వ‌ర్‌రావుల‌ రాజ‌కీయ జీవితం మొద‌ల‌యింది క‌మ్యూనిస్టు పార్టీల్లోనే కావ‌డం విశేషం.


 బ‌రిలో ఉన్న రెండు పార్టీల అభ్య‌ర్థులు క‌మ్యూనిస్టు పార్టీల మ‌ద్ధ‌తు కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు గ‌తంలో సీపీఎం లో ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఎఫ్ఐలో ప‌నిచేశారు. అంతేకాదు ఆయ‌న తాతాలు, తండ్రులు వామ‌ప‌క్ష‌వాదులు. కొన్నాళ్లు వ్యాపార నిమిత్తం విదేశాల‌కు వెళ్లిపోయిన మ‌ధు 2014లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి రాయ‌ల నాగేశ్వ‌ర్‌రావు కూడా సీపీఎం తో క‌లిసి ప‌ని చేశారు. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్‌లో చేరారు. నాగేశ్వ‌ర్ రావు కుటుంబ స‌భ్యులు ఇంకా సీపీఎంలో కొన‌సాగుతున్నారు. అందుకే వీళ్లు కామ్రేడ్‌ల స‌పోర్ట్ ఆశించారు. నిజానికి జిల్లాలో 700 కు పైగా స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు ఉన్నారు.


 వీరిలో టీఆర్ఎస్ బ‌లం 500 పైనే, కాంగ్రెస్ బ‌లం 100-120 ఉంటుంది. ఇక రెండు లెఫ్ట్ పార్టీల ఓట్లు క‌లిపి 70 వ‌ర‌కు ఉంటాయి. అయితే, కాంగ్రెస్ చాలా వెన‌క‌బ‌డి ఉంది కామ్రెడ్‌లు క‌లిసి వ‌చ్చినా విజయం క‌ష్ట‌మే. అయితే, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్‌పై ఆశ‌లు పెట్టుకోవ‌డంతో ఆస‌క్తి పెరుగుతోంది. అందుకే టీఆర్ఎస్ ఓట‌ర్ల‌ను క్యాంపున‌కు త‌ర‌లించారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థులు కామ్రేడ్ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప‌ప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి కాంగ్రెస్ కారుకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: