బాధల్లో ఉన్న వాళ్ళు ఓదార్పును కోరుకుంటారు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి తమ సమస్యలను చెప్పుకోవాలని కోరుకుంటారు. వాళ్ళ కష్టాలను తీర్చలేకపోయినా చెప్పింది సాంతం వింటే అదే చాలు వాళ్ళకు. అంతేకానీ అసలే పుట్టెడు బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళిన వాళ్ళు తమ సొంత సోది చెప్పుకున్నా, తమ బాధలను వినిపించినా ఎవరు పట్టించుకోరు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచు చెప్పుకునే చంద్రబాబునాయుడు ఇంతచిన్న లాజిక్ మిస్సయిపోయారు. అందుకనే వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనకు జనాల నుండి సానుకూల స్పందన రాలేదు.

భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడ పర్యటించినా చంద్రబాబు మాట్లాడినదాంట్లో రెండుపాయింట్లు కామన్ గా ఉన్నాయి. అవేమిటంటే మొదటిది తన భార్యను అసెంబ్లీలో వైసీపీ ఎంఎల్ఏలు అవమానించారనేది. ఇక రెండో పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటం. ప్రభుత్వం విఫలమైందని, బాధితులను ఆదుకోవటంలో ఫెయిలైందని, జగన్ వల్లే బాధితులకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పారు.

చంద్రబాబు ఆరోపణల్లో ఎంతనిజముంది అన్న విషయాన్ని కాసేపు  పక్కనపెట్టేద్దాం. అయినవాళ్ళని, కోల్పోయి, ఆస్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న జనాలను ఓదార్చాల్సిన చంద్రబాబు తానే ఓదార్పు కోరుకున్నారు. కొంపా, గోడు, డబ్బు, ఆస్తులు పోయి వాళ్ళేడుస్తుంటే చంద్రబాబు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన భార్యను అవమానించారని చెప్పుకుంటే వాళ్ళకు ఎలాగుంటుంది.  చంద్రబాబు తమను ఓదార్చటానికి వచ్చారా ? లేకపోతే ఓదార్పుకోరుకుంటున్నారా ? అన్నదే అక్కడి బాధితులకు అర్ధంకాలేదు.

ఇదే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. బాధితుల దగ్గరకు వెళ్ళినపుడు కేవలం వాళ్ళు చెప్పిందే వినాలి. తాను తక్కువగా మాట్లాడి బాధితులను ఎక్కువగా మాట్లాడించాలి. కానీ చంద్రబాబుకు ఈ అలవాటు లేదు. ఎక్కడైనా, సందర్భం ఏదైనా సరే మొత్తం తానే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు వినాలనే తత్వమే ఎక్కువ. ఇక్కడే జనాలు చంద్రబాబు వైఖరిపై మండిపోయారు. బాధితుల దగ్గరకు వెళ్ళి జగన్ను తిడితే వాళ్ళకు ఏమిటి ఉపయోగం ? ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి అది సమయం కాదు, సందర్భమూ కాదని చంద్రబాబు మరచిపోయారు.

తన మూడు జిల్లాల టూర్ పూర్తిగా ఫెయిలైందనే కోపమే ఇఫుడు జనాలను నోటికొచ్చినట్లు మాట్లాడేట్లు చేసింది. జగన్ పర్యటనలో స్పందించిన జనాలను కూడా చంద్రబాబు నోటికొచ్చింది మాట్లాడారంటే కారణమిదే. జగన్ తో సంతోషంగా మాట్లాడిన జనాలను బుద్ధుందా ? సంస్కారముందా ? పరామర్శకొచ్చిన జగన్ను ముద్దలు పెట్టుకుంటారా ? పొగుడుతారా ? అంటు మండిపోయారు. సీఎంను జనాలు ఆప్యాయంగా పలకరించటాన్ని కూడా చంద్రబాబు తట్టుకోలేకపోయారు. జగన్ అంటే చంద్రబాబుకున్న మంట జనాలకు ఎందుకుండాలి ? జనాలకు మంట లేకపోతే ఇక వాళ్ళని పట్టుకుని తిట్టేయటమేనా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: