జర్నలిజం లో రానురాను విలువలు తగ్గిపోతున్నాయి అనడం కంటే అడుగంటి పోతున్నాయని చెప్పాలి. ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక పార్టీకి ప్రచారకర్తగా ఉంటుంది తప్ప, ప్రభుత్వంలో తప్పొప్పులను ప్రజలకు తెలిపే మాధ్యమం లా అసలు ఉండటం లేదు. ఒకప్పటి విలువలు వేరు, ఇప్పటి విలువలు వేరు. ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే సత్తా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలను తమకు అనుకూలమైన నేత కోసం పడగొట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే సూటిగా ప్రజల కోసం మీడియా కాకుండా పార్టిల కోసం మీడియా అన్నట్టుగా తయారైంది.

ఇదే తెలుగు రాష్ట్రాలలో కూడా నడుస్తుంది. వారికి నచ్చని నేత అధికారంలో ఉన్నాడని ప్రభుత్వం ఏది చేస్తున్నా దానిలో లోపాలను పెద్దదిగా చేసి, అసలు ఆ పధకం నిరర్థకం అన్న అభిప్రాయాన్ని లబ్ధిదారులలో కలిగిస్తున్నారు. తద్వారా పేదవాడి నోటి దగ్గరకు వచ్చిన అనేక పధకాలు కూడా అందకుండానే పోతున్నాయి. దీనికోసం కోర్టులను అడ్డుపెట్టుకోవడం, లేనిపోని కేసులను వేయడం మరో దౌర్బాగ్యం. ఇలా మీడియా తమకు అనుకూలమైన నేత అధికారం లో లేదనే ఉద్దేశ్యంతో విషప్రచారం చేయడం ద్వారా జర్నలిజం అనే పదానికి అర్ధం మార్చేస్తున్నారు. ఇలా ఆయా పార్టీలు కూడా తమ గజ్జిని చివరికి జర్నలిస్టులకు, ఆయా మీడియా సంస్థలకు కూడా అంటించేశారు. దానికి తగ్గట్టే వాళ్ళుకూడా పనిచేస్తున్నారు.

సాధారణంగా ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకం ద్వారా లక్ష మందికి ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే, అందులో పదివేల మందికి సమస్యలు రావచ్చు. ఆ పదివేల మందికి అందలేదండి అని ప్రభుత్వాన్ని మేల్కొలిపి, వారికీ ఆయా పధకాల ఫలితాలు అందేట్టుగా చేయడం నిజమైన జర్నలిజం. కానీ ఏపీలో జరుగుతున్నది ఏమంటే, ఆ పదివేల మందికి పధకం అందుకోవడంలో ఉన్న లోపాలను విపరీతం చేసి చూపిస్తూ, అసలు ఆ పధకం నిర్వీర్యం అయిపోయిందని విషప్రచారం చేస్తున్నాయి. దీని కోసం మీడియా సంస్థలు పెట్టుకోవడం ఎందుకు, వెళ్లి ఆయా పార్టీలలో ప్రచార కర్తలుగా చేరితే అయిపోతుంది. విలువలు లేని వ్యవస్థ మేలు కంటే కీడునే చేస్తుంది. సంస్థ విలువలు వదిలేసింది అనుకుంటే, వ్యక్తికి ఏమైంది, వక్తులు కలిస్తేనే కదా సంస్థ అయ్యేది. అంటే ఇక్కడ వ్యక్తులు ముందు విలువలు కోల్పోయారు, వారందరు సంస్థ అనుకుని నడిపించేస్తున్నారు. దీనిని ఖచ్చితంగా జర్నలిజం అయితే అనరు, ఇంకేమి అంటారో వాళ్ళే తేల్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: