టీడీపీకి నాయకత్వం పై ప్రస్తుతం బాగా చర్చ జరుగుతుంది. బాబు గారి తరువాత ఇంకెవరు ఉండనున్నారు అనేది ఆ చర్చ. లోకేష్ ఉన్నారు కదా, అనేది తెలిసిన జవాబే అయినప్పటికీ, స్వయంగా వారి అనుకూల పత్రికలు కూడా ఆయనను అంగీకరించే పరిస్థితి లేదనేది గతంలో ఆయా పత్రికలలో వచ్చిన వార్తలతో అర్ధం అవుతుంది. ఇక అందరు కోరుకుంటున్నట్టుగా జూ. ఎన్టీఆర్ అనుకుందాం అనుకుంటే ఆయన ఉండటం బాబు గారికి అసలు ఇష్టమే లేదు. అందుకే మళ్ళీ ఆయనే అధినేతగా ఎన్నుకోబడ్డారు. ఇంకా మిగిలింది ఎవరు అనుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది.

ఇటీవల దీనిపై కూడా ఆయన ఒక ప్రముఖ షో ద్వారా జవాబు చెప్పేశారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే కాదంటూనే ఎంతకాలం ఉండగలరు అనేది కూడా ఇక్కడ ఉంది. తండ్రి గారి ఉద్దేశ్యం ప్రకారం కుటుంబ పాలన వద్దనుకుంటున్నట్టు బాలకృష్ణ గారు చెప్పారు. కానీ ఎవరు దిక్కులేనప్పుడు ఆపద్ధర్మంగా ఉండాల్సిన బాధ్యత అయితే ఆయన మీద ఉంటుంది కాబట్టి ఈ సాకు అడ్డుపెట్టుకొని అయినా టీడీపీ వర్గాలు ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే అనుకుంట ఇటీవల ఒక ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో అభిమానులు, కార్యకర్తలు కూడా సీఎం బాలయ్య సీఎం బాలయ్య అని నినాదాలు చేశారు.  

నాయకత్వ సమస్య వచ్చినప్పుడు తండ్రి పార్టీకి అండగా ఉండకుండా బాలయ్య కూడా ఎలా ఉండగలరు అనేది అభిమానుల అంచనా. ఇప్పటి అధినేతకు తన వారసత్వం కాకుండా మరొకరు పార్టీ పగ్గాలు పట్టుకోవడం ఇష్టం ఉంటుందా లేదా అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఒకవేళ ఎట్టి పరిస్థితులలోను నందమూరి కుటుంబం పార్టీ విషయాలలో జోక్యం చేసుకొని పక్షంలో బహుశా ఇతర సీనియర్ నేతలు ఆ బాధ్యతలు స్వీకరించాలని బాలయ్య లాంటి వారే సూచించవచ్చు. ఆ బాధ్యత కూడా బహుశా ప్రస్తుత అధినేత బుజాల మీదే ఆయన వదిలేయవచ్చు కూడా. ఒక్కసారి ఆపద్ధర్మంగా ఉండాల్సి వచ్చినా తండ్రి ఉద్దేశ్యానికి చెదలు పట్టినట్టు అవుతుంది అని ఆయన భావిస్తే, పార్టీకి ఇక సీనియర్ లే గతి. లేదంటే లోకేష్ కు పట్టాభిషేకం చేసేయవచ్చు, పార్టీ ఏమైపోయినా, ఈ మార్పు తప్పకపోవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: