రెండు తుఫానులు హుద్ హుద్, తిత్లీ.. మా శ్రీకాకుళాన్ని మా ఉత్తరాంధ్రను అతలాకుతలం చేశాయి. అప్పుడు సీఎం చంద్రబాబు. ఆ వేళ ఆయనేం చేశారో అన్నది గుర్తు చేసుకోవాల్సిందే! డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయన ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అన్నది కూడా కీలకమే! అదేవిధంగా ఇప్పుడు మళ్లీ రెండు తుఫానులు కేవలం రెండంటే రెండు నెలల వ్యవధిలో ఒకటి గులాబ్ రెండు జవాద్. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అప్పటిలా ప్రాణ నష్టం పెద్దగా లేదు. రెండు తుఫానులూ తీవ్రం అయినవే! అయితే గాలుల తీవ్రత గులాబ్ కు ఎక్కువ. విద్యుత్ శాఖకు జరిగిన నష్టమే వెయ్యి కోట్లు అదీ శ్రీకాకుళం పరిధిలో!



అదే జవాద్ కు సంబంధించి జరిగిన ఆస్తి ప్రాణ నష్టాల వివరాలు అయితే అందాల్సి ఉంది. అనధికార వర్గాల సమాచారం అనుసరించి నిన్నటి వేళ మా శ్రీకాకుళంలో వజ్రపుకొత్తూరు మండలంలో ఇంటర్ విద్యార్థిని కొబ్బరి చెట్లు కూలిన ఘటనలో చనిపోయారు. ఇంకా దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదనే తెలుస్తోంది. ఇక ఆస్తి నష్టం కు సంబంధించి వివరాలు సేకరించేందుకు, పంట నష్టం అంచనావేసేందుకు సంబంధిత బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఓ విధంగా జగన్ చేయాల్సినంత చేశారు.

కొన్ని తప్పిదాలు ఉన్నప్పటికీ  ఫీల్డ్ విజిట్ లేకుండానే మొత్తం పనులు బాగా చక్కదిద్దారు.ఆ రోజు చంద్రబాబు హుద్ హుద్ విలయం తో వైజాగ్ వణికిపోతే అక్కడే ఉండిపోయారు. బస్సు నుంచే కార్యకలాపాలు నడిపి అధికారులకు ఉరుకులు,పరుగులు పెట్టించారు. చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది. విద్యుత్ ను మూడు రోజుల్లో పునరుద్ధరించి నగరంలో మొదట వెలుగులు నింపారు. అదే సందర్భంలో పనులన్నింటినీ చంద్రబాబే దగ్గరుండి పర్యవేక్షించారు. తిత్లీ సమయంలోనూ బాబు అదే పనితనం ప్రదర్శించి ఎంపీలనూ, ఎమ్మెల్యేలను క్షేత్ర స్థాయికి పంపి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఓ విధంగా ఆ రోజు చంద్రబాబు చేసిన పనులన్నీ మంచి ఫలితాలే ఇచ్చాయి.


పోలికల్లో భాగంగా చూస్తే చంద్రబాబు పరుగులు పెట్టించినంతంగా జగన్ అధికారులను పరుగులు తీయించలేదు కానీ మంచి పనితనాన్నే వారి నుంచి రాబట్టారు. అదేవిధంగా తుఫాను సాయం గులాబ్ కు సంబంధించి అందించి ఇప్పటికే మంచి మార్కులే వేయించుకున్నారు. పంట నష్టం అంచనాల్లో ఆ రోజు ఈ రోజు ఆరోపణలు ఉన్నాయి. వీటిని దిద్దుకుంటే మేలు. హుద్ హుద్ అంత తీవ్ర తుఫానులు ఇవి కాకున్నా క్షేత్ర స్థాయిలో నెలకొన్న నష్టం ను నివారించాల్సిన బాధ్యత  ప్రభుత్వానిదే!


మరింత సమాచారం తెలుసుకోండి: