మన దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్ లో 9కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నవంబర్ 25న సౌతాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చారు. వాళ్ల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ అని తేలింది. అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ కుటుంబంతో కాంటాక్ట్ అయిన మరో ఐదుగురికి కూడా ఒమిక్రాన్ సోకింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది.

ఇక తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 1నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి 970మంది ప్రయాణీకులు హైదరాబాద్ కు వచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా 13మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని క్వారంటైన్ కి పంపించినట్టు చెప్పారు. కొద్దిరోజుల్లో ఒమిక్రాన్ కాదా అనేది తేలుతుందన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా యంత్రాంగాన్ని ముమ్మరం చేశామని శ్రీనివాస్ రావు అన్నారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్ ని వణికిస్తోంది. ఆ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 160కి చేరింది. వైరస్ సోకిన వారిలో ఎక్కువగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారేనని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకులపై నిషేధం విధించింది. బ్రిటన్ కు వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది. ఇక నైజీరియా నుంచి వచ్చిన వారిని హోటళ్లకు తరలిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల కారణంగా అమెరికా ఆంక్షలు విధించింది. విదేశీ ప్రయాణీకులకు నిబంధనలను కఠినతరం చేసింది. తమ దేశంలోకి రావాలంటే తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేసింది. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి కానీ వైరస్ మాత్రం విస్తరిస్తూనే ఉంది.

 






మరింత సమాచారం తెలుసుకోండి: