గాలుల తీవ్రతలు నెమ్మదించాయి. శనివారం సాయంత్రానికే గాలుల తీవ్రతలు, అదేవిధంగా మిగతా వాతావరణ స్థితిగతులు ఒక్కొక్కటిగా చక్కదిద్దుకోవడం మొదలయింది. జవాద్ తుఫాను కారణంగా పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వాతావరణ నిపుణుల నుంచి శనివారం సాయంత్రమే సమాచారం రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పంట నష్టం ఆస్తి నష్టం మాత్రం ఎంతన్నది తెలియ రాలేదు. ప్రాథమిక అంచనాలు కూడా పూర్తికాలేదు. జిల్లాలో అత్యధికంగా గార మండలంలో, అత్యల్పంగా వీరఘట్టం మండలంలో వాన కురిసిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వానల కారణంగా ప్రాజెక్టులకు కూడా పెద్దగా ప్రమాదమేమీ లేదు. తీర ప్రాంతం కోతకు గురైన దాఖలా కూడా నమోదు కాలేదు. ఇవన్నీ కాస్త ఉపశమనం ఇచ్చిన పరిణామాలే కావడం విశేషం.


గండం గట్టెక్కింది. అంతా తుఫాను భయంతో వణికిపోతున్న తరుణాన ఓ శుభవార్త నిన్న సాయంత్రానికి వచ్చి చేరింది. తుఫాను కాస్త తీవ్ర వాయుగుండంగా మారి పూరి దగ్గర తీరం దాటనుందన్న వార్త ఒకటి ఉపశమనం కలిగించేలానే ఉంది. మొదట్నుంచి జవాద్ తుఫాను విషయమై అందుతున్న వార్తలన్నీ తీర ప్రాంత ప్రజలలో చాలా ఆందోళనలకు తావిచ్చాయి. అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్ర తీరంలో చిక్కుకుపోతే వారి గతేం కాను అన్న భయాలు వెల్లడి అయ్యాయి. అయితే ఎట్టకేలకు తుఫాను శాంతించింది. దీంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలయిన వానలు శనివారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. కొన్ని  చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడిక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయింది.తుఫాను పీడిత ప్రాంతాలకు ఒకరోజు ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.



ఈదురు గాలుల ప్రభావానికి వజ్రపుకొత్తూరు మండలంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని చెట్టు కూలి మరణించింది. ఇదొక్కటే శ్రీకాకుళం జిల్లాలో తుఫాను కారణంగా అధికారికంగా నమోదు అయిన మరణం. విద్యార్థిని పేరు గొరకల ఇందు. వయసు 17 ఏళ్లు. ఆమె తండ్రి బతుకు తెరువు నిమిత్తం దుబాయ్ కు వెళ్లాడు. మొత్తం ముగ్గురు సంతానంలో మొదటి అమ్మాయికి పెళ్లయింది. ఈమె రెండో అమ్మాయి. పూండి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఈ ఆడబిడ్డ మరణం ఉద్దానం మెళియాపుట్టి (మృతురాలి స్వగ్రామం) లో విషాద ఛాయలను నింపింది. ఇదొక్కటీ మినహాయిస్తే జిల్లాలో ప్రాణ నష్టం లేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం పంట నష్టం వివరాలను అంచనా వేస్తామని శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: