ప్రస్తుత మానవ సమాజంలో  మనుషుల సంబంధబాంధవ్యాల మధ్య ఎంతో తేడా వచ్చింది. కనీసం సొంత వారిని కూడా పట్టించుకొనే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వారు లేరు. దీనికి కారణం టెక్నాలజీ పెరగడం. అన్నీ అందుబాటులోకి రావడం. కానీ బంధాలు, అనుబంధాల గురించి మనం తరచూ మాట్లాడుతూనే ఉంటాం. కుటుంబ వ్యవస్థలో వీటి ప్రస్తావన ఎక్కువగానే ఉంటుంది. తల్లి,తండ్రి,అక్క,తమ్ముడు, చెల్లి,అన్న, అత్త,మామ, తాత,అమ్మమ్మ, నానమ్మ ఇలా పిలుచుకునే బంధాల్లో హృదయ సంబంధమైన దగ్గరితనం ఉంటుంది. ప్రేమతో కూడిన బాధ్యత ఉంటుంది.జీవితం ఉన్నంతకాలం కొనసాగే అనుబంధమది. ఒకరినొకరు సంతోషాలను, ఆనందాలను, దుఃఖాలను, బాధలను, వేదనలను ఆత్మీయంగా పంచుకునే సంబంధాలుగా ఈ బాంధవ్యాలు సమాజంలో ఎప్పటినుండో కొనసాగుతూ ఉన్నాయి. కుటుంబంలో ఒకరి బాధను ఇంకొకరు పంచుకోవడం, ఒకరి కష్టాలు తొలగించే ప్రయత్నం మరొకరు చేయడం ఈ సంబందాల్లో ఉంటుంది.

అందుకు తగిన ఆచరణ, త్యాగము చూడగలుగుతాము. భూమి తో మనిషికి ఉండే సంబంధం గాఢమైనది గా ఉంటుంది.భూమిని వదులుకోలేని మనస్తత్వం ఉంటుంది. అదే విధంగా కుటుంబ సంబంధాలు బలీయంగానే ఉంటాయి. ఈ బంధాలు కూడా విడివడకుండా ఒక అనుబంధం మానసికంగా కట్టివేయబడి కొనసాగుతుంది. అంటే అంతా సాఫీగానే ఆనందంగానే సాగుతుందని అనుకోవడానికి లేదు. భూమిపై యజమాని,అతని ఆధిపత్యం ఎలా ఉంటుందో, కుటుంబంలో కూడా యజమాని అనే భావన ఇంటి పెద్దగా సాగుతుంది.అంతేకాకుండా భూస్వామిక విలువల ఆధారంగా ఏర్పడిన కులవ్యవస్థ లక్షణాలన్నీ కుటుంబంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగా పితృస్వామిక ఆధిపత్యం ఉంటుంది.వీటికి మహిళలల కుటుంబ సభ్యుల సమ్మతి కూడా ఉంటుంది. అయితే సమాజ జీవనంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూమిపై ఉండే యాజమాన్య ఆలోచనలు మారాయి. పంటలు పండించాలన్న దాని  నుండి సంపద సృష్టించుకోవాలనే భావన పోయి, భూమిని వ్యాపార సరుకుగా మార్చి వేయడం జరిగింది.దీంతో దానికి సంబంధించిన అన్ని సంబంధాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. భూమి ఆధారంగా జీవిస్తున్న జీవితాల పైన కుటుంబ వ్యవస్థ పైన ఈ ప్రభావం పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: