మన దేశంలో ఇప్పటి వరకు 21ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలోని బెంగళూరులో 2కేసులు వచ్చాయి. 4న గుజరాత్ లో, మహారాష్ట్రలో ఒక్క కేసు నమోదైంది. ఇక ఈ ఒక్క రోజే 17కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో1, మహారాష్ట్రలో 7, రాజస్థాన్ లో 9 వేరియంట్ కేసులు వచ్చాయి. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిపై కేంద్ర, రాష్ట్రాలు గట్టి నిఘా పెడుతున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు కంపల్సరీ చేశారు.

ఇక షాపింగ్ మాల్స్, థియేటర్లలో ఎంట్రీకి కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు పగడ్బందీగా అమలవుతున్నాయి. బెంగళూరులో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపిస్తేనే మాల్స్.. థియేటర్లలోకి అనుమతిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేపడతామని, ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూసిన కారణంగా అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు పెడతారనేది అపోహ మాత్రమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు భయపడకుండా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గించేదిలేదనీ..ఎక్కడో ఎవరో ధరలు తగ్గించారని తాము తగ్గించేది లేదని స్పష్టం చేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందన్నారు తలసాని.

మరోవైపు ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో ఒక్కసారిగా విమాన ఛార్జీల ధరలు రెండింతలు అయ్యాయి. క్రిస్మస్ సీజన్ కారణంగా.. ఒమిక్రాన్ భయాలు ఫ్లయిట్ ఛార్జీలపై పడ్డాయి. భారత్ నుంచి రద్దీ మార్గాలుండే.. కెనడా, లండన్, దుబాయ్ సర్వీసుల రేట్లు డబుల్ అయ్యాయి. ఇక అమెరికాలోని ప్రధాన నగరాలకు గతంలో టికెట్ ధర 90వేల రూపాయలు ఉంటే.. ఇప్పుడు 1.70లక్షలకు చేరింది.





















మరింత సమాచారం తెలుసుకోండి: