ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర స్థాయి నుండి కుగ్రామము స్థాయి వరకు తారు
రోడ్డు, సిమెంట్ రోడ్ల పరిస్థితి పెద్ద మొత్తంలో శిథిలావస్థలో ఉన్నట్లుగా వివిధ ప్రాంతాల నుండి విమర్శలు వస్తున్నవి. అంతెందుకు హైదరాబాదు నగరంలోని చాలా రహదారులు లోపభూయిష్టంగా, శిథిలమై, గుంతలు పడి, రాళ్లు తేలి కంకరతో కొట్టుమిట్టాడుతుంటే పత్రికల్లో టీవీలలో కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టువంటివి సుమారుగా దశాబ్దము దాటి పోయినవి కనుక తిరిగి మరమ్మతుల జాడ లేకపోవడంతో  ప్రయాణాలకు పెద్ద రోడ్లు సైతం సిద్ధంగా లేవు. గత ఐదారు సంవత్సరాలుగా గుంతలు పడి  ప్రయాణానికి ఇబ్బంది కలుగుతున్నా నిధుల మంజూరు కానీ ,మరమ్మత్తు , కొత్త రోడ్డు నిర్మాణానికి గాని ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల చాలా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు పురస్కారాలు ప్రధానం చేసినప్పటికీ ఏ అభివృద్ధిని, పారిశుద్ధ్యాన్ని చూసి ఇచ్చినారో అర్థం కావడం లేదు. పురపాలక సంఘాలు కార్పొరేషన్ లతోపాటు గ్రామీణ ప్రాంత రోడ్లు హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా లేవు. ఒకవేళ మరమ్మతులు అక్కడక్కడ చేసినా నాణ్యతలేని మరమ్మతుల కారణంగా ప్యాచ్ వర్క్ కే మళ్లీ మరమ్మతు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనుల మీద ఎంత శ్రద్ధ చూపుతుందో కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ విభాగంలో ఎంత అవినీతి జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
 మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంకు ఒకవైపు వంగిపోయిన విషయం మనందరికీ తెలిసినదే. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కెనాల్ కొద్దిరోజులకే  తెగిపోవడానికి కూడా నాణ్యత లేని పనులే కదా కారణం.
        ఇక చాలా రోడ్లు ధ్వంసమై శిథిలమై మిషన్ భగీరథ కారణంగా పైపులైన్ల కోసము తవ్వడం తో డబల్ రోడ్లు సింగల్ రోడ్లు గా మారిపోయినవి. ఇక మరమ్మతు చేసిన సందర్భంలో మొత్తము రోడ్డును రిపేరు చేయకుండా వన్ సైడ్ మాత్రమే రిపేరు చేయడం తో వచ్చి పోయే వాహనాలు వన్ సైడే ప్రయాణం చేయడం వల్ల కూడా ప్రమాదాలు విచ్చలవిడిగా జరుగుతున్నవి. రోడ్డుపై దుమ్ము విచ్చలవిడిగా వాహనాలపై, ప్రయాణికులను రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఇళ్లలోకి చొరబడి అనేకమంది అనారోగ్యానికి కారణం అవుతున్నది. మిషన్ భగీరథ ఇతర శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా పైప్లైన్ కోసం తవ్విన చోట రాళ్ళు, బండలు, కంకర రోడ్డు పై నిలిచి ప్రయాణానికి ఇబ్బంది కావడమేకాకుండా ప్రమాదాలు నిత్యము చోటుచేసుకుంటున్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి: