ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్ర, మరోవైపు ఓటీఎస్ వ్యవహారం, ఇక ధర పెంపు సర్వ సాధారణం, అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. పీఆర్‌సీ అమలు, సీపీఎస్ రద్దు, డీఏ అంశాలపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ శర్మకు ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు ఓ దుమారం రేపుతున్నాయి. ఈ సమయంలో వరదలతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు జగన్ సర్కార్‌ను మరింత ఇబ్బంది పెడుతోంది కూడా. భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. వరదల కారణంగా ఒక్క కడప జిల్లాలోనే 40 మంది వరకు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఇదే విషయం జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపుతోంది కూడా. కేవలం అకాల వరద కారణంగానే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోయాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వాదిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిందంటూ లోక్‌సభలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అటు ఆత్మరక్షణలో పడిన వైసీపీ సర్కార్... కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని స్వయంగా మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారని ఎదురు దాడి చేశారు. జరిగిన తప్పు గురించి కేంద్ర మంత్రి దగ్గర కనీస సమాచారం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఎదురుదాడి మొదలు పెట్టారు. కేంద్రాన్ని తప్పుబడితే ఇబ్బందులు తప్పవంటూ ఎంపీ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: