బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పుడు దేశంలో సూపర్ హీరో. కరోనా మొదటి దశ సమయంలో దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. అప్పుడు ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇక వలస కూలీల పరిస్థితి అయితే... మరీ దారుణం. పూట గడవని దుస్థితిలో ఉన్న వారిని సొంత ఖర్చులతో ఇంటికి పంపించారు బాలీవుడ్ స్టార్ విలన్ సోనూసూద్. అప్పటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలతో దేశంలో సూపర్ హీరో అయ్యారు. ఓ ట్వీట్ చేస్తే చాలు.. సోనూ టీమ్ వచ్చి సాయం చేస్తుందని ఇప్పటికే అందరి మదిలో నిలిచిపోయింది. అయితే ఈ స్టార్ హీరోను కూడా కొన్ని ఘటనలు ఇబ్బందులు పెడుతున్నాయి. పద్మ శ్రీ పురస్కారం సోనూకు కాకుండా కంగనా రనౌత్‌కు ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. గతంలో సోనూ సూద్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది కేంద్రం. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇదంతా కేవలం తమ రోటీన్ చెక్ అని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది కూడా. అటు బీజేపీ నేతలు కూడా మాకేం సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు.

ఇప్పుడు తాజాగా సోనూసూద్‌ను మరోసారి చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ముంబయి మహానగరం  జుహూ ప్రాంతంలో సోనూసూద్‌కు ఓ హోటల్ ఉంది. ఇప్పుడ ఆ హోటల్‌కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జులై నెలలో తొలిసారి సోనూసూద్‌కు బీఎంసీ అధికారులు నోటీసు ఇచ్చారు. జుహూలోని హోటల్‌ను నివాస భవనంగా మార్చాలని.... అలాగే అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని కూడా తమ నోటీసుల్లో బీఎంసీ పేర్కొంది. దీనికి సోనూసూద్ కూడా వివరణ ఇచ్చారు. భవనాన్ని తానే పునరుద్ధరిస్తానంటూ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ పనులను సోనూ పూర్తి చేయలేదు. ఆరు అంతస్తుల భవనాన్ని నివాస సముదాయంగా ఇంకా మార్చలేదంటూ నోటీసులో ప్రశ్నించింది. ప్రణాళిక ప్రకారం నివాసితులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని... హోటల్ కార్యకలాపాలను నిర్వహించరాదంటూ నోటీసులో పేర్కొంది. దీనికి సోనూ వివరణ ఇచ్చారు. ఇప్పటికే భవనంలో హోటల్ రద్దు చేశామని... త్వరలోనే డాక్యుమెంటేషన్ పని పూర్తి చేసి బీఎంసీకి సమర్పిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: