మరో నాలుగు నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు కూడా ప్రారంభించింది. అటు దేశంలోని ప్రధాన పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. యూపీ ఎన్నికల కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా మొదలు పెట్టింది. ఇక సమాజ్ వాదీ పార్టీ అయితే... ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కూడా. గోవా ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. అయితే పంజాబ్‌లో మాత్రం పరిస్థితి విచిత్రంగా తయారైంది. తాజాగా వెల్లడైన ఏబీపీ - సీ ఓటర్ సర్వే ప్రకారం... మరోసారి పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. అయితే పంజాబ్‌లో బీజేపీ బోణీ కొట్టడం కష్టమని... కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో తేలింది.

పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీరుతో విసిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తమ సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేక పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఇప్పుడు పంజాబ్‌లో సత్తా చాటేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పంజాబ్‌లో మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం పరిస్థితి సిద్ధూ వర్సెస్ కేజ్రీవాల్ మాదిరి పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ... గెస్ట్ లెక్టరర్లతో కలిసి ఆప్ అధినేత ఇంటి ముందు సిద్ధూ ఆందోళన చేశాడు. కేజ్రీవాల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. ఢిల్లీలో అధికంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఉచిత పథకాల ముసుగులో కేజ్రీవాల్ మోసం చేస్తున్నారని సిద్ధూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు పంజాబ్‌లో కూడా ఉచిత విద్యుత్ ఇస్తానంటూ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని సిద్ధూ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: