ఒన్ టైమ్ సెటిల్మెంట్ పేరిట రాష్ట్ర ప్ర‌భుత్వం

లబ్ధిదారుల‌కు ఇంటి హ‌క్కు క‌ల్పించాల‌ని

చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా

రాజ‌కీయ రంగు పులుముకుంటోంది ఈ వివాదం




ఆంధ్రావ‌నిలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. స‌మ‌స్య నెల‌ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాక‌పోగా కొత్త‌వి పుట్టుకువ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం కూడా ఇలాంటిదే. ఒన్ టైం సెటిల్ మెంట్ పేరిట ప్ర‌భుత్వ గృహాలు పొందే ల‌బ్ధిదారులు ప‌ది వేలు రూపాయ‌లు చెల్లించి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా స‌ర్వ హ‌క్కుల‌తో ఇల్లు సొంతం చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న రూపంలో నిన్న‌టి వేళ సీఎం జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రంలో  2011 ఆగ‌స్టు 15 వ‌ర‌కు గృహ నిర్మాణ సంస్థ వ‌ద్ద స్థ‌లాల‌ను త‌న‌ఖా పెట్టి ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న దాదాపు 40 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారులు అస‌లు, వ‌డ్డీ క‌లిపి  14400 కోట్లు రూపాయ‌లు (సుమారు) క‌ట్టాల్సి ఉంద‌ని, ఇందులో వెయ్యి కోట్లు రుణ మాఫీ చేస్తూ చెల్లించాల్సిన అస‌లు, వ‌డ్డీ ఎంత ఎక్కువ మొత్తం ఉన్నా నిర్దేశించిన నామ మాత్ర‌పు రుసుము గ్రామాల‌లో అయితే ప‌దివేలు, మున్సిపాల్టీల‌లో 15 వేలు, కార్పొరేష‌న్ల‌లో 20వేలు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మాఫీ చేసి పూర్తి హ‌క్కుల‌తో ఇంటి స్థ‌ల ప‌త్రాల‌ను వారి పేర్ల‌తోనే రిజిస్ట్రేష‌న్ చేసి ఇస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు చెబుతోంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం ఇచ్చిన ఇంటి ప‌ట్టా తీసుకుని గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణం తీసుకోక‌పోయినా ఇప్ప‌టికీ ఇంటి మీద హ‌క్కులు లేని దాదాపు 12 ల‌క్ష‌ల మందికి నామ మాత్ర రుసుము చెల్లింపుతోనే ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తామ‌ని అంటున్నారు.



అదేవిధంగా ఈ ప‌థ‌కంలో స్వ‌చ్ఛందంగానే ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి త‌మ ఇంటి హ‌క్కు పొంద‌వ‌చ్చ‌ని దీనిపై ఎటువంటి ఒత్తిడీ ఉండ‌దు అని కూడా చెబుతున్నారు. రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు గౌర‌వ ముఖ్య‌మంత్రి డిసెంబ‌ర్ 21న సంబంధిత హ‌క్కు ప‌త్రాల‌ను అందిస్తారు అని కూడా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇవ‌న్నీ బాగానే ఉన్నా తాము ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వం  చెప్పిన విధంగా డబ్బు క‌ట్ట‌లేమ‌ని ల‌బ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ కూడా ఈ అంశాన్ని రాజ‌కీయం చేస్తోంది. మీరు ఎవ్వ‌రికీ డ‌బ్బులు క‌ట్టాల్సిన ప‌ని లేద‌ని తాము అధికారంలోకి రాగానే  రూపాయి కూడా చెల్లించ‌కుండానే ఇంటి  హ‌క్కు క‌ల్పిస్తామ‌ని అంటోంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే అస‌లు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకున్న వారి డేటా ఏదీ పూర్తిగా త‌మ ద‌గ్గ‌ర లేద‌ని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా డేటా లేద‌ని కూడా చెబుతున్నారు.



గృహ నిర్మాణ సంస్థకు చెందిన ల‌బ్ధిదారుల‌కు, తమ వ‌ద్ద ఉన్న డేటాకు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని కూడా అధికారులు అంటున్నారు.దీంతో ల‌బ్ధిదారుల గుర్తింపు, వారితో సొమ్ములు చెల్లింపు, రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ అన్న‌ది అనుకున్నంత సులువు కాద‌ని యంత్రాంగం త‌లలు ప‌ట్టుకుంటోంది. ఇదే స‌మ‌యంలో ప్రకృతి విపత్తుల కార‌ణంగానో లేదా మ‌రో కార‌ణంగానో ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న త‌మకు ఈ ఓటీఎస్ ఎందుకని ప్ర‌శ్నిస్తున్నారు ఇంకొంద‌రు ల‌బ్ధిదారులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

ap