ఆంధ్రావ‌నిలో కొత్త రాజకీయం పునాదులు తీసుకుంటోంది. ఆ విధంగా అయినా త‌మ‌ ప‌ని తాము చేసుకుని పోయేలా కొన్ని వ్య‌వ‌స్థ‌లు రూపుదిద్దుకుంటాయేమో చూడాలి. రెండు రాజ‌కీయ పార్టీలే ఈ యుద్ధానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో అస‌లు త‌ల‌నొప్పులు అన్నీ మొద‌ల‌వుతున్నాయి. అందుకే టీడీపీ లేదా వైసీపీ అన్న సూత్రం ఒక‌టి అమ‌లు అవుతుంది పాల‌నా పగ్గాలు అందుకునే క్ర‌మంలో!  




మొన్న‌టి అసెంబ్లీ వేదిక‌గా వైసీపీ స‌భ్యులు కొంద‌రు త‌రువాత వ‌ల్ల‌భ‌నేని వంశీ లాంటి నేత‌లు కొంద‌రు చేసిన వ్యాఖ్య‌లు కార‌ణంగా రాజ‌కీయ యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో వైసీపీ క‌న్నా టీడీపీ వ‌ర్గాలు సెంటిమెంట్ లేదా సింప‌థీ రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తూ పోతున్నాయి. వ‌ర్గ రాజ‌కీయాల‌ను పెంచి పోషించే విజ‌య‌వాడ కేంద్రంగా ఇన్ని స‌మీక‌ర‌ణాలు, ఇంకొన్ని కుట్ర రాజ‌కీయాలు అమ‌లు కావ‌డ‌మే విశేషం. అదే ఉత్పాతం కూడా!




ఈ క్ర‌మంలో బెజ‌వాడ బెట్టింగుల రాజ‌కీయం ఆంధ్రావ‌ని ప్ర‌గ‌తినో లేదా స్థితినో ఎలా నిర్దేశిస్తుంది. టీడీపీ అయితే ఇప్ప‌టికి మైలేజీ సాధించి త‌మ ప‌ట్టు నిలుపుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది.నోరు జారీ సున్నిత అంశాల జోలికి పోయి వైసీపీ త‌న ప‌రువు తానే గంగ‌లో క‌లుపుకుంది. దీంతో సెంటిమెంట్ రాజ‌కీయాల‌కు లేదా సానుభూతి రాజ‌కీయాల‌కు టీడీపీ త‌న కేరాఫ్ అడ్ర‌స్ ఇస్తే, అందుకు త‌గ్గ ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా సాగిపోతాయి. మ‌రి! వైసీపీ డ్యామేజీని ఎవ‌రు పూరిస్తారు. ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు స‌ర్ది చెబుతారు. ఓ మ‌హిళ‌ను ఉద్దేశించి మాట్లాడిన మాట‌ల కార‌ణంగానే ఇంత రాద్ధాంతం అని తేలిపోయింది. గతంలో రోజాను కూడా ఉద్దేశించి చంద్ర‌బాబు ఇలా అన్నా అనిపించినా, ఇప్పుడు పాత కోపాల నేప‌థ్యంలో భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి వైసీపీ నాయ‌కులు అన్నా లేదా అనిపించినా రెండూ త‌ప్పే!




ఆ రోజు శాస‌న స‌భ‌లో ర‌గ‌డ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ముసిముసి న‌వ్వులు న‌వ్వకుండా ఉంటే స‌రిపోయేది. కానీ ఆయ‌న ఆ విధంగా చేయ‌కుండా వివాదాన్ని కొన‌సాగించేందుకే ఇష్ట‌ప‌డ్డారు త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో! ఈ నేప‌థ్యంలో వైసీపీకి జ‌రిగిన న‌ష్టం ఎంతో ఉంది. కానీ దీనిని పూరించేందుకో నివారించేందుకో కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. అవి స‌ఫ‌లీకృతం అవుతాయో లేదో మ‌రి!


మరింత సమాచారం తెలుసుకోండి: