ఏపీ ఎన్జీఓలకూ సీఎంకూ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. కొత్త వేతన సవరణను వెంటనే అమలు చేయాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో రాయబారాలు నడుపుతున్నా ఫలితం లేకపోయింది. అయితే తమకు కొంత గడువు ఇస్తే ఏదో ఒక విషయమై స్పష్టత ఇస్తామని అంటున్నారు సీఎం వర్గాలు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు నిన్నటి వేళ సమావేశమై సీఎంను అనరాని మాటలు అన్నారు. దీంతో గొడవ తీవ్ర స్థాయిలో ఉంది.


ఆంధ్రావనిలో కొత్త పీఆర్సీ విషయమై తీవ్రమయిన చర్చ ఒకటి నడుస్తోంది. ఉద్యోగి జీవితాన్ని ప్రభావితం చేసే వేతన సవరణపై ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో తామే అమీతుమీ తేల్చుకుంటామని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మండిపడుతున్నారు. వాస్తవానికి ఖజానాలో డబ్బులు లేని కారణంగానే కొత్త పీఆర్సీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్నది వాస్తవం. రెండు దశల్లో కరోనా రావడం పూర్తిగా నిధులు అటుగా ఖర్చయిపోవడం, సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాల్సి రావడం, మరిన్ని నిధులు అప్పులు రూపంలో తేవాల్సి రావడం వగైరా వగైరా కారణాల రీత్యా జగన్ నానా పాట్లూ పడుతున్నారు. దీంతో ఒకటో తారీఖుకే జీతం అన్నది వేయడం కుదరని పనిగానే అయిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి మరీ! ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నాయకులు మండి పడుతున్నారు.


వాస్తవానికి కొత్త పీఆర్సీపై చర్చలు నడిచాయి. కొన్ని విషయాలను ఉద్దేశించి క్లారిఫికేషన్ కూడా సీఎం ఇచ్చారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు తాము చెప్పిందే జరిగి తీరాలన్న పట్టుదలతో ఉంటూ సీఎంపై ఫైర్ అవుతున్నారు. తోటి సంఘాలు కొన్ని రోడ్డెక్కితే ఏపీ ఎన్జీఓ సంఘం కూడా వారి వెంటే నడవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీని ఉద్దేశించి నిన్నటి వేళ బండి శ్రీను చాలా వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు అన్నది పిచ్చి విజయంతో సమానం అన్న అర్థం వచ్చేవిధంగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల గెలుపు అన్నది అంత సులువేం కాదని అందుకు తాము అహర్నిశలూ కృషి చేశామని తమని ఉద్దేశించి బాధ్యత ఉన్న ఓ ఉద్యోగ సంఘం నేత ఈ విధంగా మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: