నిత్య అసంతృప్త వాదం అన్న‌ది ఒక‌టి రాజకీయంలో ఉంటుంది. కాంగ్రెస్ లో కూడా ఈ త‌ర‌హా నాయ‌కులు ఎంద‌రెంద‌రో ఉన్నారు. వాళ్లే వైసీపీ నాయ‌కులుగా అవ‌త‌రించి రాష్ట్ర పాల‌న‌లో భాగం పంచుకుంటున్నారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తూనే, ఆయ‌న కానీ ఆయ‌న త‌ర‌ఫు మ‌నుషులు త‌ప్పు చేస్తే త‌ప్పు అని చెప్పేంత ధైర్యం చాలా మందికి ఉంది. దీన్నెవ్వ‌రూ కాద‌నరు కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారే అన్న వాద‌న ఒక‌టి వినవ‌స్తోంది ఎప్ప‌టిక‌ప్పుడు. దీంతో పార్టీలో ఆగ్ర‌హావేశాలు కూడా కొన్ని సార్లు క‌ట్ట‌లు తెగుతున్నాయి. 



మొన్న‌టి వేళ ధ‌ర్మాన ఇండైరెక్టుగానే జ‌గ‌న్ ను టార్గెట్ చేశారు. రోశ‌య్య‌కు నివాళి ఇస్తూనే ఆర్థిక మంత్రిగా ఆయ‌న ప‌నిచేసినంత కాలం గాడి త‌ప్ప‌ని పాల‌న చేస్తూనే, వైఎస్ కు అండగా ఉన్నార‌ని చెప్పారు. అప్పు అంటే ఆయ‌న ఇష్ట‌ప‌డేవా రే కాద‌ని గుర్తుచేశారు. ఓవ‌ర్ డ్రాఫ్ట్ పేరిట రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద‌గ్గ‌ర సొమ్ములు తీసుకోవ‌డం ఆయ‌నకు ఇష్ట‌మే ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మాట‌ల లోతు కాస్త అర్థం చేసుకుంటే ఇప్ప‌టి ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాలేంటో ఇట్టే అర్థం అవుతాయి.




ఇక జ‌గ‌న్ అంటే వీర విధేయ‌త ఉన్న నేత‌లు కూడా ఇవాళ పార్టీ  నిర్ణ‌యాల‌ను బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌లను సైతం మీడియా హైలెట్ చేస్తోంది కానీ అవి పార్టీ ప్ర‌క్షాళ‌న‌కు ప్ర‌భుత్వ విధి విధానాల మార్పున‌కు ఉప‌యోగ‌ప‌డ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం. అందుకే జ‌గ‌న్ ఏం చెప్పినా విన‌రు అని ధ‌ర్మాన అంటారు. ఏం చెప్పినా వినిపించుకోరు అని కూడా ధ‌ర్మానే అంటారు. త‌న‌కు కానీ త‌న‌లాంటి సీనియ‌ర్ల‌కు కానీ క‌నీస గౌర‌వం ఉండ‌ద‌ని కూడా ప‌దే ప‌దే అంటుంటారు. త‌న మాట విన‌గ‌లిగితే ఏద‌యినా చెప్పేందుకు ఓ అవ‌కాశం ఉంటే బాగుంటుంద‌ని ఎప్పుడూ అభిప్రాయ‌ప‌డుతుంటారు మా శ్రీ‌కాకుళం పెద్దాయ‌న. వైఎస్ తో రోశ‌య్య‌తో అదేవిధంగా కిర‌ణ్ కుమార్ రెడ్డితో మంచి అనుబంధాలు ఉన్న మంత్రిగా ఆయ‌న‌కు ఎంతో పేరున్నా ఇవాళ అవేవీ ప‌నిచేయ‌వు. ఆయ‌న అనుభవం జ‌గ‌న్ కు అవ‌స‌రం లేదు కూడా! ఇదే తీరులో పార్టీపై అసంతృప్తి చూపడంలో ఆనం రాం నారాయ‌ణ రెడ్డి  కానీ న‌ల్ల‌పురెడ్డి ప్ర‌సన్న కుమార్ రెడ్డి కానీ ఉన్నా వారి మాట‌ల‌కూ విలువ లేదు. విలువే లేని చోట తామెందుకు అని చాలా సార్లు వీరంతా బాధ‌ప‌డిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. అయినా ఇవేవ  జ‌గ‌న్ ప‌నితీరును మార్చ‌బోవు. ఆయ‌నేంటో ఆయ‌న‌కు తెలుసు. ఆయ‌నేంటో మ‌నం కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల్సిందే.. మ‌రో రెండున్న‌రేళ్ల వ‌ర‌కూ!

మరింత సమాచారం తెలుసుకోండి: