వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీ పై రెండు సంవత్సరాలుగా ఎడతెగని పోరాటం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను సైతం పదేపదే టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న ఆయన నరసాపురం ఎంపీ సీటు ఆశించారు. జగన్ సైతం ఆయనకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ ఇంచార్జ్ ప‌ద‌వి ఇచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ తో విభేదించిన ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే టిడిపి కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నరసాపురం ఎంపీ సీటు ర‌ఘు రామ‌కు కేటాయించే విషయంలో తాత్సారం చేయడంతో ఆయన టిడిపి నుంచి బయటికి వచ్చేశారు.

అనంతరం ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు న‌ర‌సాపురం ఎంపీ సీటు ద‌క్కించు కున్నారు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే జగన్ కు ర‌ఘు రామ‌కు మధ్య గ్యాప్ పెరిగింది. చివరకు అది పెద్దది అవడంతో జగన్ రఘురామ ను పార్టీ నుంచి బహిష్కరించిన కుండా ఆయన ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలంటూ నేరుగా లోక్ స‌భ‌భ స్పీకర్ ఓం బిర్లాకు త‌మ పార్టీ ఎంపీల చేత‌ ఫిర్యాదు చేయించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో రఘురామ కు ఎలాగూ వైసిపి సీటు దొరకదు. ఈ క్రమంలోనే ఆయన టిడిపిలోకి వెళ‌తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రఘురామ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న నర్సాపురం లోక్‌స‌భ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ర‌ఘురామ ఇప్పుడు వైసీపీ లోనే ఉంటూ జ‌గ‌న్ పై చేస్తోన్న పోరాటానికి టీడీపీ వాళ్లు కూడా ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే న‌ర‌సాపురం టీడీపీ ఎంపీ క్యాండెట్ అన్న చ‌ర్చ‌లు టీడీపీ వర్గాల్లో కూడా జరుగుతున్నాయి. మ‌రి ర‌ఘురామ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: