గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ తో పాటు చంద్రబాబు వియ్యంకుడు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఇక బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కూడా విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే వీరిలో కుప్పం నుంచి చంద్రబాబు , హిందూపురం నుంచి బాలకృష్ణ మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మంగళగిరి లో పోటీ చేసిన లోకేష్ తో పాటు విశాఖ లో ఎంపీగా పోటీ చేసిన శ్రీ భరత్ సైతం ఓడిపోయారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ గుంటూరు జిల్లా నుంచి బరిలో ఉంటే ... చంద్రబాబు , బాలయ్య ఇద్దరూ కూడా రాయలసీమ జిల్లాల నుంచి పోటీ చేశారు. విచిత్రమేంటంటే తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో వచ్చిన మూడు సీట్లలో బాలయ్య , చంద్రబాబు వే రెండు ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబు , లోకేష్ ల లో ఎవరో ఒకరు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలలో ఎవరో ఒకరు ఉత్త‌రాంధ్ర నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం, ఊపు వస్తాయని ఆ ప్రాంత టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం గంటా ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ నియోజకవర్గం లేదా భీమిలి నియోజకవర్గాలు చంద్రబాబు లేదా లోకేష్ పోటీ చేసేందుకు అనుకూలంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బాలయ్య ప్ర‌స్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు ఈసారి కుప్పం నుంచి మారి ఉత్తరాంధ్రకు వస్తే బాగుంటుంది అన్న చర్చ ఉంది. లోకేష్‌ మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే లోకేష్ ఈ సారి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే మంచి ప్రభావం ఉంటుందని... ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: