వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రస్తుతం రాజకీయాల్లో ఆయనకు ఎదురు లేకుండా ఉంది. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ జీవితంలో అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరించి రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ స్థాపించారు. ప్రజల్లోకి వెళ్లారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. అన్ని వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరి సమస్యలు తెలుసుకున్నారు. నేను ఉన్నాను... నేను విన్నాను... అంటూ హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ విజ్ఞప్తి చేశారు. అనూహ్య మెజారిటీతో అధికారంలోకి కూడా వచ్చారు. రెండేళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది. కానీ ఇప్పుడే వైఎస్ జగన్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

పాదయాత్ర సమయంలో జగన్ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి జీవ నాడి లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. ప్రాజెక్టుకు 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంటూ గత ప్రభుత్వానికి కేంద్రానికి నివేదికలు పంపింది. అంత అవసరం లేదంటూ అప్పట్లో వైసీపీ ఎంపీలతో కేంద్రానికి లేఖలు కూడా రాయించారు జగన్. ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని... కేవలం 35 వేల కోట్ల రూపాయలు మాత్రమే సరిపోతుందన్నారు కూడా. తీర అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మరోసారి కేంద్రాన్ని పోలవరం నిధుల కోసం విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం సూచించిన విధంగా 55 వేల కోట్లు ఇవ్వాలని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అది అసాధ్యమంటూ కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి తేల్చేశారు కూడా. కేవలం ఇరిగేషన్ పనులకు మాత్రమే కేంద్రం పూచీగా ఉందన్నారు. ఇదే విషయం ఇప్పుడు వైసీపీకి మింగుడు పడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: