ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే దానిలో ప్రధాన పాత్ర ఖచ్చితంగా పౌరులకు ఉంటుంది. ప్రజలు ముందుకు వస్తేనే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా రూపుదిద్దుకుంటుంది. కేవలం ప్రభుత్వం ఒక్కటి చేయడం అనేది నిరంకుశత్వం అనిపించుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలదే ప్రధాన పాత్ర కాబట్టి, వారు దేశం గురించి కనీసం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాస్త తెలుసుకున్నప్పుడు దేశంలో ఉన్న వనరులు ఏమిటి, వాటిలో ఏమి సాధించవచ్చు, లోటు ఏమి ఉంది, అది ఎక్కడ నుండి తెచ్చుకోవచ్చు, ప్రభుత్వం తో ఎక్కడెక్కడ భాగస్వామిగా పనిచేయాల్సి ఉంది, ఇలాంటివి ప్రజలు ఆలోచించాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రజలు స్తబ్దుగా మాకెందుకు, ఓటేశాం అంతా నేతలు చూస్కుంటారులే అని పక్కకు వచ్చేస్తే వాళ్ళు జేబు నిండా కాదు, ఏకంగా తరాలకు తరగనిది మూటకట్టుకుంటున్నారు.

ఇదంతా ప్రజల తప్పు మాత్రమే. ఎవరో ఎదో ఒకటి చెప్పగానే నమ్మేసి, ఓటు వేసేసి ఐదేళ్లు బానిసల్లాగా బ్రతికేస్తున్నారు. ఒకడు తిన్నాడు, ప్రజా సేవ చేయలేదు అని తెలుసుకుని కూడా మారారు వాళ్ళే వచ్చి, మరో అవకాశం ఇవ్వండి, ఈసారి బాగా చేస్తాను అంటే నమ్మేస్తున్నారు ప్రజలు. ఇదంతా అమాయకత్వం మాత్రం కాదు, నిర్లక్ష్యమే అంటారు చూసేవాళ్ళు. కాసేపు సమయం వెచ్చించి ఐదేళ్లు పాలించే వారి గురించి పరికించి నిర్ణయం తీసుకుంటే, ఆ ఐదేళ్లు స్వేచ్ఛగా ప్రజలు మాత్రమే బ్రతికేయడం కాదు, దేశం ముందడుగు వేస్తుంది, రేపటి తరాలు మంచి జీవితాన్ని అందుకోగలవు. ఇందుకు ముందు ప్రజలలో మార్పు రావాల్సిందే. ఓటుకు ఒకనాడు నోటు తీసుకుని, ఐదేళ్లు కన్నభూమి పోయినా, తల్లిపోయినా చూస్తూ భరించాల్సి వస్తుంది అనేది ఇంకా ఈ ప్రజలకు తెలియకుండానే ఉంటుంది అంటే నమ్మడం కుదరదు.  

ప్రజల్లో మార్పు సమసమాజ స్థాపనకు బాట వేస్తుంది. అది దేశసౌభాగ్యాన్ని చక్కదిద్దుతుంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నంతకాలం ఇలాంటి నేతలు పుట్టుకొస్తూనే ఉంటారు, అలాంటి పార్టీలు కూడా రోజుకు ఒకటి వస్తూనే ఉంటుంది. జీవన విధానంలో విలువలు మాత్రం పెరగవు. దానిని అభివృద్ధి అనరు, దిగజారిపోవడం అంటారు. అదే ఇన్నేళ్లు జరిగింది కాబోలు, ఇకనైనా మారితే దేశం కోసం కాదు. మీ మీ పిల్లల కోసం అయినా మారవచ్చు. అది చేతకాకపోతే రేపటి తరాలలో ఉన్న మీ బిడ్డలు కూడా మరింతగా వెనక్కి నెట్టివేయబడతారు తప్ప, ముందుకు అడుగు కూడా వేయడం సాధ్యపడదు అని గ్రహించండి. తినే వాడిని కూడా వాడు మనవడు అని నెత్తిన పెట్టుకుని ఊరేగితే, దేశం పోతుంది, అందులో ఉన్న నీ తరాలు కూడా పోతాయి. అది గ్రహించండి ప్రజలారా!

మరింత సమాచారం తెలుసుకోండి: