భారత్ సరిహద్దు ప్రాంతం ఎంతో సురక్షితంగా ఉందని కేంద్రం ప్రకటించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రస్తుతం భారత్ కంట్రోల్‌లోనే ఉందని పార్లమెంట్‌లోనే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. భూటాన్ సరిహద్దుల్లో గత ఏడాదిలో పలు మార్లు చోరబాట్లకు ప్రయత్నం జరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. చైనా, భూటాన్ దేశాల సరిహద్దుల్లో చొరబాటు అనే మాటే ప్రస్తుతం లేదన్నారు. గత మూడేళ్లుగా సరిహద్దులు పూర్తి కంట్రోల్‌లో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. చైనా సరిహద్దుల్లో గత ఏడాది కాలంగా చొరబాట్లు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్రం బ్రేక్ కొట్టింది. మూడేళ్లలో ఎలాంటి చొరబాట్లు లేవన్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో అంతర్జాతీయ సరిహద్దుల్లో చొరబాట్లు జరిగినట్లు ఎన్నో వార్తలు వచ్చాయని.... కానీ అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని నితీశ్ ప్రమాణిక్ వివరణ ఇచ్చారు.

అయితే మూడేళ్లలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో 128 చొరబాట్లు జరిగినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యధికంగా 17 వందల 87 చొరబాట్లు జరిగాయన్నారు. నేపాల్ సరిహద్దుల్లో కేవలం 25 చొరబాట్లు, మయన్మార్ సరిహద్దుల్లో 133 చొరబాట్లు జరిగినట్లు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి నితీశ్. చైనా, భూటాన్ సరిహద్దుల్లో మాత్రం మూడేళ్లలో ఎలాంటి చొరబాట్లు చోటు చేసుకోలేదన్నారు. సరిహద్దు రక్షణ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగటం లేదన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు మరింత పటిష్టం చేశామన్నారు. నిఘా పెంపుతో పాటు నిరంతర గస్తీ కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి. అరుణాచల్ ప్రదేశ్ విషయంపై చైనా వాదనను మరోసారి తోసి పుచ్చింది. చైనా ఆర్మీ దాదాపు వంద అశ్వ దళాలతో చొరబాటుకు యత్నించిన అంశం పెద్ద దుమారం రేపింది. కానీ అలాంటిది ఏమీ లేదని కేంద్రం చెబుతోంది. భారత్ - చైనా మధ్య పలు మార్లు సైనికాధికారుల చర్చలు జరిగినా కూడా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: