రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకూ మధ్య యుద్ధమే నడుస్తోంది. ప్రభుత్వం ఏం చెప్పినా కూడా అందుకు అనుగుణంగా పనిచేసేందుకు ఉద్యోగ సంఘాలు ఇవాళ సిద్ధంగా లేవు అని తేలిపోయింది. అయితే తాము బెదిరింపులకు భయపడేదే లేదని అంటున్నారు వైసీపీ ప్రభుత్వ పెద్ద సజ్జల. ఎవరికి వారు తమని తాము ఒక ప్రెజర్ గ్రూప్ అనుకుని ఎన్నికల్లో తాము చెప్పిందే నెగ్గుతుంది అని చెప్పడం సబబు కాదని అంటున్నారీయన. మరోవైపు తాము ఎప్పటి నుంచో పీఆర్సీ విషయమై అడుగుతున్నా  నివేదికల పేరిట తొలుత కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రయోజనం మాత్రం నెరవేర్చడం లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ఇదే సందర్భంలో  బండి శ్రీనివాసరావు అనే ఉద్యోగ సంఘ నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. మీ మాయ మాటలు నమ్మి మీకు 151 సీట్లు ఇచ్చాం అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వానికీ, ఉద్యోగ వర్గానికీ మధ్య సయోధ్య ఎలా సాధ్యం?


మారుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేరుగా ఆ మాట చెప్పలేకపోయినా ఆ అర్థంకు దగ్గరగా ఉండేవిధంగా మాట్లాడుతూ, ఉద్యోగి డిమాండ్ మంచిదే న్యాయపరమైనదే కానీ మేం తీర్చలేం అనే చెబుతోంది. ఇప్పటికిప్పుడు కొత్త వేతన సవరణ తీసుకుని రాలేం అని కూడా స్పష్టం చేస్తోంది. ఆ విధంగా చేయాలం టే కొంత గడువు ఇవ్వాలని కోరుతోంది. ఇదే నిన్నటి వేళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే ఉద్యోగ సం ఘాల ప్రతినిధుల మాట మాత్రం మరో విధంగా ఉంది. తాము తల్చుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తామని, తమ దగ్గర అరవై లక్షల ఓట్లు ఉన్నాయని అంటున్నారు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు. 




ఇప్పటికే వేతన సవరణపై నిర్ణయం వెలువరించడం ఆలస్యం అయిందని, ప్రస్తుతం ఒకటో తారీఖు జీతాలు చెల్లించేందుకే ప్రభుత్వం నానా అవస్థలు పడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో తాము తప్పక ఈ నెల ఏడు నుంచి ఉద్యమ రంగంలోకి దిగుతున్నామని అంటున్నారు. రెండు జేఏసీలు ఈ ఉద్యమ కార్యాచరణకు ఉపక్రమిస్తున్నాయి. ఒకటి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి. ఈ రెంటి పరిధిలో 13 లక్షల ఓట్లు ఉన్నాయని వీరంతా ఉద్యోగులేనని, తాము న్యాయ పరమైన డిమాండ్లకు మాత్రమే కట్టుబడి ఉద్యమం చేస్తున్నామని సాధించే వరకూ కార్యాచరణ ఆగదని స్పష్టం చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: