ఉద్యోగులకూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు జగన్ వైపు మద్దతుగా ఉంటున్నారు. ఇంకొందరు తమ పంతం నెగ్గించుకునే పద్ధతికి ఓటేస్తున్నారు.



ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయి తమ వాదన తాము వినిపిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయిన నిరసనల్లో కొన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొనడం లేదు. ముఖ్యంగా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ నిరసనలకు దూరంగా ఉంది. అదేవిధంగా ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఓ వర్గం జగన్ కు మద్దతుగా మరో వర్గం వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీఓ సంఘం నేతృత్వంలో క్రియాశీల కార్యాచరణ అన్నది ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలిక.

కొత్త వేతన సవరణకు సంబంధించి అదేవిధంగా కొన్ని డిమాండ్లకు సంబంధించి ఆంధ్రావనిలో వేతన జీవులు ఇవాళ్టి నుంచి ఉద్యమ బాట పట్టారు. నిరసనలో భాగంగా ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న ప్రధాన ఆరోపణలో భాగంగా వీరంతా నిరసలకు వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు తమ మాటల్లో వేడిని  కూడా పెంచారు. తాము అనుకుంటే ప్రభుత్వాలను కూల్చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలే చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా కాస్త ఘాటుగానే వీరు స్పందిస్తూ పొలిటికల్ మైలేజీ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షం నుంచి కూడా మంచి మద్దతు కోరుకుంటున్నారు. ఇదేమీ తప్పు కాకపోయినా గతంలో మాదిరిగా ఇవాళ ఉద్యోగి చేస్తున్న ఉద్యమాలకు ప్రజల నుంచి అయితే మద్దతు రాదు. ఎందుకంటే కేవలం జీత భత్యాల పెంపుదల కోసమే నానా యాగీ చేస్తున్నారన్న వాదనను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే నవ్వుల పాలయ్యేది ఉద్యోగులే! ఇవన్నీ ఆలోచించకుండా ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కూడా తగదని కూడా అంటున్నారు ఇంకొందరు. ఈ తరుణాన ఉద్యోగ సంఘాల వైపు సానుభూతి రాజకీయం అయితే నడవదు. అదేవిధంగా కాస్తో కూస్తో తగ్గి మాట్లాడితేనే జగన్ వినే ఛాన్స్ ఉంటుంది కానీ తమకు తామే గొప్ప వ్యక్తులం తామే రాజకీయాలను శాసించగలం అని చెప్పుకుంటే అంతకుమించిన అవివేకం ఇంకొకటి ఉండదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: