వారం రోజుల్లో పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్థిక అంశాలు బేరీజు వేసుకొని పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పీఆర్సీ తేలాక డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాత పింఛను విధానం అమలుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణలో న్యాయ వివాదాలున్నాయని.,. దశల వారీగా క్రమబద్దీకరణ చేపడతామని తెలిపారు.

థర్డ్ వేవ్, ఒమిక్రాన్ పై ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని.. లేకుంటే చాలా వేగంగా పుంజుకునేదని సీఎం జగన్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సహా అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో బ్యాంకర్లు, ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలన్నారు. బ్యాంకుల సహకారంతో రాష్ట్ర ఆర్థిక స్థితి గట్టెక్కిందన్నారు.

ఇక పీఆర్సీ అమలు సహా 71డిమాండ్ లు నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏలూరు నగర పాలక పంపుల చెరువు, ఆర్టీసీ డిపోల దగ్గర ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఆందోళనలో ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

మరోవైపు 55శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాల్సి ఉందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఏడు డీఏలకు గాను రెండు మాత్రమే ఇచ్చారనీ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగుల 71డిమాండ్ల కోసమే ఉద్యమ బాటను ఎంచుకున్నామని.. ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ నిర్ణయం వారిని సంతృప్తి పరిచిందో లేదో చూడాలి.వారు ఏ విధంగా స్పందిస్తారో మరి.

 





మరింత సమాచారం తెలుసుకోండి: