ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు మరో కీలక నేత గుడ్ బై చెప్పేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ మాత్రం రాజకీయాల్లో కొనసాగేది లేదని తేల్చేశారు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు. 2024 ఎన్నికల తర్వాత తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు సోము వీర్రాజు స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఇదే ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రంలో పెద్దగా ఓటు బ్యాంకు లేని బీజేపీకి కాస్త జవసత్వాలు ఇచ్చిన నేతగా సోము వీర్రాజు గుర్తింపు తెచ్చుకున్నారు. కాస్త దూకుడుగా వ్యవహరించే సోము వీర్రాజు... రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పార్టీ కేడర్‌లో ఓ ఊపు కూడా తీసుకువచ్చారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఘోర పరాజయం చూశారు కమలం పార్టీ నేతలు. అయితే ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ విషయంలో సోము వీర్రాజు కీలక పాత్ర పోషించారు కూడా.

అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీపై ఒంటికాలితో దూకే సోము వీర్రాజు... ఫలితాల అనంతరం కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై అదే దూకుడు ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో సోము వీర్రాజు వ్యవహారం కొంత అనుమానం కూడా కలిగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే అపవాదు కూడా సోము వీర్రాజు మూట గట్టుకున్నారు. పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డితో కలిసి జగన్‌తో లాలూచీ పడ్డారనే ఆరోపణలు కూడా వీర్రాజుపై వెల్లువెత్తాయి. రాష్ట్రంలో బీజేపీని భారతీయ జగన్ పార్టీగా వీర్రాజు మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకోసమే... పార్టీలో వీర్రాజు ప్రాధాన్యత తగ్గిపోయిందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సొంత పార్టీలోనే వీర్రాజుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే చర్చ జరుగుతోంది. ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా కేంద్ర పెద్దలు కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలో పేరుకే పెద్దగా ఉన్నాననే భావన ప్రస్తుతం వీర్రాజుకు కలిగినట్లు సన్నిహితుల మాట. దీంతో రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: