టీఆర్ఎస్ పార్టీ శీతాకాల పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించింది. తొమ్మిది మంది లోక్‌స‌భ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉభ‌య స‌భల‌ నుంచి వాకౌట్ చేశారు. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌కు నిర‌స‌న‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ల‌కు త‌రలించ‌క‌పోవ‌డంతో ధాన్యం పాడ‌యిపోయే పరిస్థితి ఏర్పడింద‌ని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కె.కేశ‌వ‌రావు అన్నారు. ర‌బి పంట‌ ధాన్యం సేక‌ర‌ణ‌లో కేంద్రం వివ‌క్ష చూప‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. వారం రోజులుగా పార్ల‌మెంట్ వేదికగా ఆందోళ‌న‌లు కొనసాగిస్తున్నామ‌ని చెప్పారు.


 త‌మ ఆందోళ‌నల‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఉభ‌య స‌భ‌ల స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించామ‌ని తెలిపిన కెకె త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. అంత‌కుముందు లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు వినూత్నంగా ఆందోళ‌న‌లు తెలియ‌జేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా ఎంపీలు న‌ల్ల‌దుస్తుల్లో స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. రాజ్య‌స‌భ‌ల‌, లోక్ స‌భ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం మొండి వైఖ‌రి న‌శించాలంటూ, వ‌రి ధాన్యం కొనుగోలు పై కేంద్రం స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.


 రైతాంగం కోసం గ‌త వారం రోజులుగా స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి నినాదం చేస్తూ నిర‌స‌న తెలిపారు. రైతుల‌పై ఎక్కుపెట్టిన న‌ల్ల చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్న కేంద్రం.. ధాన్యం కొనుగోళ్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వడం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను బ‌హిష్కరించిన టీఆర్ఎస్ ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఎంపీలు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చి సీఎం కేసీఆర్‌తో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం త‌రువాత ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో తెలియ‌నుంది. వ‌రుస చేరిక‌ల‌తో ఉత్సాహంగా ఉన్న బీజేపీకి షాక్ ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాలు ప‌న్నుతార‌ని  రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి బీజేపీని ఎదుర్కొనేందుకు గులాబీ బాస్ ఏ అస్త్రాల‌ను వాడుతారో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: