రైల్వేల పరంగా కొన్ని కూతలు మాత్రమే మిగిలాయి..కొన్ని చేతగాని రాతలు కూడా మిగిలాయి. అయినా కూడా మాకు విశ్వాసం సడలదు. మాలో నమ్మకాలు చచ్చి ఏ స్వర్గాన్నో లేదా ఏ నరకాన్నో చేరిపోవు. మేం అంతా నిరంతర స్వాప్నికులం. ఆశా జీవులం.


అసలు సభలో కట్టడి లేని స్వేచ్ఛా జీవులం కూడా మేమే. మేం సిసలు నాయకులకు సిసలు ఓటర్లము.. కనుక మా స్వప్నాలు కావిక వాస్తవికాలు. మా జీవితపు ఆశలు నీటి రాతలు మరియు మా భావాలు గాలి రాతలు.. మా జీవితాలు కల్లోలిత కెరటాలు కావొచ్చు. మా తీరం చెంత జోన్ రాదని తేలిపోయినాక జగన్ సర్ ను ఏమయినా అనగలనా అంటే పద్ధతిగా బతకగలనా! పనిలో పనిగా నాయుడి గారి టీం కు మరియు రెడ్డి గారి టీంకు వందనాలే వందనాలు. ఈ సంధ్యాకాంతుల్లో అభినందన చందనాలు కూడా!



విశ్వాసపాత్రులయిన విశాఖ వాసులకు చెడు వార్త.. విశ్వాసం లేని నాయకులను ఎన్నుకున్న పాపానికి చెబుతున్న చెడు వార్త. రాష్ట్రం విడిపోయాక పోనీ ఏమయినా దక్కాల్సింది దక్కిందా అంటే అదీ లేదు అని చెప్పుకునేందుకు రైల్వే పరంగా మన లైన్లు కేవలం ఆర్థికంగా సరకు రవాణాకు మాత్రమే ఉపయోగపడతాయని బల్ల గుద్ది చెప్పిన కేంద్రం తరువాత జోన్ ఊసు ఊహ వద్దంటే వద్దు అని చెప్పేసింది ఇవాళ. గౌరవనీయులయిన పార్లమెంటేరియన్లు ఇంటికి వచ్చాక మనం అంతా ఎదురెళ్లి స్వాగతం పలికి అప్పుడెప్పుడో మీసం మెలేసిన మన అనంతపురం పెద్దాయనను గోరంట్ల మాధవ్ ను కలిసి వద్దాము లేదా మన ప్రాంత సమస్యలను గాలికి వదిలి స్వ ప్రయోజనాలనే ప్రామాణికం అనుకుని ఎదుగుతున్న రాజ్య సభ సభ్యుడు గౌరవ వైఎస్సార్సీపీ పెద్ద సాయి రెడ్డిని కలిసిపోదాం.



ఈ విషయం మా శ్రీకాకుళం ఎంపీ రామూ కాస్త మినహాయింపు. ఆయన ఎన్నో సార్లు జోన్ విషయమై అడిగారు. గోడు వెళ్లగక్కారు. గొడవ చేశారు. అయినా కూడా నాయుడి గారి టీం ఆ పని ఎందుకో సాధించలేకపోయింది. పోనీ రెడ్డి గారి అబ్బాయి వారి టీం అయినా సాధించిందా అంటే అదీ లేదు. మా విశాఖ ఎంపీకి సినిమాలంటే పిచ్చి. జోన్ అంటే లేదు. అందుకే ఆయన నిర్మాతగా ఉంటారు. నిర్మాణ విలువలను కాపాడుకుంటారు. మూర్తిగారికో నమస్సు. ఇక అరకు ఎంపీ (గొడ్డేటి మాధవి) మేడమ్ గురించో లేదా అనకాపల్లి ఎంపీ (భీశెట్టి వెంకట సత్యవతి) మేడమ్ గురించో రాయాలి. కానీ రాయను రాయలేను. ఎందుకంటే నా మనస్సు అంగీకారంలో లేదు. ఆడవాళ్లు పోటాపోటీగా ఎదిగి అవకాశాలు దక్కించుకుంటున్న తరుణాన వీళ్లిద్దరూ ఎంపీలూ ఎన్నిక అయ్యాక మా ప్రాంతానికి చేసిందేం లేదు అని రూఢీ అయిపోయింది.



ఇక విజయనగరం అన్నయ్య అయిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా మా ప్రాంతానికి చేసిందేం లేదు. కనుక ఇందరున్నా ఇందరు లేకపోయినా మాకు మాత్రం చుక్కలు తప్పవు. స్వేద బిందువుల నాట్యాలు ఆడుతున్న వేళ మీ మీ ముసి ముసి నవ్వులను చూడక తప్పదు. కనుక మాకు జోన్ రావడం కుదరని పని అని ఇవాళ కేంద్రం తేల్చినందుకు థాంక్స్. ఇదంతా మా ప్రాప్తం అని అనుకోవడంలో ఏ తప్పూ లేదు. ఇంతటి అసమర్ధ రాజకీయాలకు ప్రతినిధులుగా ఉన్న గౌరవ ఎంపీలను ఇంకాస్త గౌరవించడం మరియు అభినందించడం అన్నవి ఆనందించదగ్గ పరిణామాలకు సంకేతాలే!


- రత్నకిశోర్ శంభుమహంతి


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp